ఆత్మబలంతో నెగ్గిన దసరా బుల్లోడు!


 తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. 1960, 70లలో దాదాపు అరవై ఏళ్ళ క్రితం సమాజంపై సినిమాల ప్రభావం,ప్రజల్లో సినిమాల పట్ల క్రేజు ఎక్కువవుతున్న రోజుల్లో తెలుగు నేలపై కోస్తా తీరం నుంచి సినీ రంగంలోకి వచ్చిన తరానికి చెందిన వ్యక్తి - వి.బి. రాజేంద్రప్రసాద్‌గా ప్రసిద్ధులైన వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్. నాటకాల్లో నటించి, ఆ అనుభవం, ప్రేమతో అటు నుంచి వెండితెరపైకి వచ్చారాయన. నటుడు కావాలనే కోరికతో సినీ రంగానికి వెళ్ళినా, నిర్మాతగా మొదలై, అపూర్వమైన విజయాలు సాధించి, అనుకోని రీతిలో దర్శకుడిగా మారి, ఆ విభాగంలోనూ రాణించిన ఘనత ఆయనది.

 

 రంగస్థలంపై స్త్రీ పాత్రధారి!

 ఎనభై రెండేళ్ళ క్రితం 1932 నవంబర్ 4న కృష్ణాజిల్లా ఉయ్యూరులో జన్మించిన వి.బి. రాజేంద్ర ప్రసాద్ స్వగ్రామం - గుడివాడ తాలూకా డోకిపర్రు గ్రామం. ఆయన తండ్రి జగపతిరావు చౌదరి భూస్వామి. స్కూలు చదువంతా పామర్రు, గన్నవరం, బందరుల్లో చేసిన ఆయన కాకినాడ పి.ఆర్. కాలేజీలో బి.ఎస్సీ చేశారు. కాలేజీ రోజుల్లోనే నటనపై మోజుతో ఆయన రంగస్థలం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పటి ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ సమయంలోనే అదే కాలేజీలో బి.ఏ. చదువుతున్నారు. తరువాతి రోజుల్లో ీసినీ హీరోగా రాణించిన హరనాథ్ వీళ్ళకు ఒక ఏడాది జూనియర్. మరికొందరితో కలసి వీరంతా ఒక బృందంగా ఏర్పడి, నాటక రంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ పేరిట ‘రాఘవ కళా సమితి’ ఏర్పాటు చేసి, ఆ గొడుగు కింద నాటకాలు ప్రదర్శించేవారు.

 

  వడ్డాది సూర్యనారాయణ, తరువాత కాలంలో సినీ రంగంలో పేరు తెచ్చుకున్న విజయచందర్, అర్జా జనార్దనరావు, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఆ సంస్థలో కీలకసభ్యులు. ఆనాటి రంగస్థల ప్రముఖుడు డాక్టర్ గరికపాటి రాజారావుతో ఆ సంస్థను ప్రారంభించారు. ఆ రోజుల్లో రాజేంద్రప్రసాద్ రంగస్థలంపై ఆడవేషాలు కూడా వేసి, మెప్పించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘అంతర్ కళాశాలల నాటక పోటీ’ల్లో ఆత్రేయ ‘కప్పలు’ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, రాజేంద్రప్రసాద్ కథానాయిక పంకజం పాత్రను అద్భుతంగా పోషించారు. ఆ స్త్రీ పాత్రలో ఆయన ఉత్తమ నటిగా, అదే నాటకంలో ఏడిద నాగేశ్వరరావు ఉత్తమ నటుడిగా బహుమతులు గెల్చుకోవడం విశేషం. ఆత్రేయ ‘వరప్రసాదం’, రెంటాల గోపాలకృష్ణ ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’, అవసరాల సూర్యారావు ‘పంజరం’, అనిసెట్టి సుబ్బారావు ‘చెప్పు కింద పూలు’, పినిశెట్టి శ్రీరామమూర్తి ‘ఆడది’ లాంటి నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించి, బహుమతులందుకున్నారు.

 

 తండ్రి పేరిట చిత్ర నిర్మాణ సంస్థ

 అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం రీత్యా, హీరోగా రాణించాలని సినీ రంగానికి వచ్చిన ఆయన అక్కినేని సలహాతో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. తొలి సినిమా విఫలమైతే, వ్యవసాయానికి వచ్చేయాలని షరతు పెట్టి తండ్రి జగపతిరావు చౌదరి ఆయనకు యాభై వేలు ఇచ్చారు. తండ్రి పేరు మీదే తమ చిత్ర నిర్మాణ సంస్థకు ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అని పేరు పెట్టారు రాజేంద్రప్రసాద్. మరో మిత్రుడు పి. రంగారావుతో కలసి స్థాపించిన ఆ సంస్థపై ఆయన నిర్మించిన తొలి చిత్రం - ‘అన్నపూర్ణ’. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆ తరువాత వరుసగా ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘అంతస్తులు’, ‘ఆస్తిపరులు’, ‘అదృష్టవంతులు’ తదితర చిత్రాలను అందించారు. ఆ చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. అలా అతి కొద్ది కాలంలోనే తెలుగు చిత్రసీమలోని నాగిరెడ్డి - చక్రపాణిల ‘విజయ’, దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ’ తదితర ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థల సరసన రాజేంద్రప్రసాద్ ‘జగపతి’కి స్థానం దక్కింది.

 

 ఆయన కొలువు... స్టార్స్‌కు నెలవు

 అక్కినేనికి బాగా సన్నిహితుడైన రాజేంద్రప్రసాద్ సహజంగా ఆయనతోనే అప్పట్లో ఎక్కువ సినిమాలు నిర్మించారు. ఆనాటి మరో ప్రముఖ నటుడు జగ్గయ్య ‘జగపతి’ వారి చిత్రాల్లో పర్మినెంట్ ఆర్టిస్ట్. ఇక, భానుమతి, ఎస్వీ రంగారావు, జమున, జయలలిత, బి. సరోజాదేవి, వాణిశ్రీ, మంజుల, శోభన్‌బాబు - ఇలా స్టార్స్‌తో రాజేంద్రప్రసాద్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేసేవి. ఆయన తమ ‘అంతస్తులు’ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. అలాగే, ‘ఆస్తిపరులు’ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది. అక్కినేని, బి. సరోజాదేవి నటించిన ‘ఆత్మబలం’ వానపాట ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ లాంటి వాటితో ఇవాళ్టికీ జనహృదయాల్లో నిలిచిపోయింది.

 

 ఆపద్ధర్మ దర్శకత్వం... ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్

 ఇటు కథ, అటు పాటలు, మరోపక్క సంగీతం - ఇలా అన్నీ దగ్గరుండి చూసుకొనే ఆ తరం ఉత్తమ నిర్మాతల్లో వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఒకరు. దర్శకుడు వి. మధుసూదనరావు డేట్స్ కుదరకపోవడంతో, అక్కినేని ప్రోత్సాహం అండగా, అనుకోని పరిస్థితుల్లో ‘దసరాబుల్లోడు’తో రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. సినిమా రూపకల్పనపై, సామాన్య ప్రేక్షక జనం నాడిపై ఆయనకున్న అవగాహనకు సాక్ష్యం - వాణిశ్రీ, అక్కినేని నటించిన ‘దసరాబుల్లోడు’ అప్పట్లో ఆల్‌టైమ్ హిట్ కావడం! ఆ చిత్రంలోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ పాటలు ఇవాళ్టికీ జనం నోట నిలిచిపోయాయి.

 

 అలాగే, దర్శకుడిగా ఆయన రెండో చిత్రం ‘బంగారు బాబు’, ఆ సినిమాలో మళ్ళీ అదే అక్కినేని, వాణిశ్రీపై వచ్చే ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...’ పాట ఆ తరం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే! ‘మంచి మనుషులు’, ‘బంగారు బొమ్మలు’, ‘ముద్దుల కొడుకు’, ‘ఎస్.పి. భయంకర్’, ‘కెప్టెన్ నాగార్జున’ తదితర చిత్రాలుఆయన దర్శకత్వంలోవే! తెలుగుతో పాటు తమిళంలో ‘ఎంగళ్ తంగరాజా’, ‘ఉత్తమన్’, ‘పట్టాకత్తి భైరవన్’, హిందీలో ‘రస్తా ప్యార్‌కే’, ‘బేకరార్’ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అలాగే, పల్లవి వారి ‘అందరూ దొంగలే’, అన్నపూర్ణా స్టూడియో వారి భాగస్వామ్యంతో తీసిన ఎన్టీఆర్ - ఏయన్నార్‌లతో ‘రామకృష్ణులు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తన చిత్రాల్లోని హిట్ పాటలను గీతమాలికగా రూపొందించి, ‘చిటపట చినుకులు’ పేరిట రెండు భాగాల సినిమాలుగా విడుదల చేసి, అక్కడా విజయం అందుకున్నారు. అలాగే, దర్శకుడు దాసరితో ‘లంచావతారం’, రవిరాజా పినిశెట్టితో ‘బంగారు బుల్లోడు’, ఫాజిల్‌తో ‘కిల్లర్’ తదితర చిత్రాలు అందించారు.

 

 


కార్మికుల కోసం సినీ నిర్మాణం

 అభిరుచి గల నిర్మాతగా, సంస్కారవంతుడైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ అందుకు తగ్గట్లే తన కోసం శ్రమించే వారి బాగు చూసేవారు. జగపతి సంస్థలో పనిచేసే కార్మికుల బాగు కోసం ఆ రోజుల్లోనే ఆయన ‘పిచ్చిమారాజు’ అనే చిత్రం నిర్మించారు. ఆ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్మికులకే పూర్తిగా కేటాయించారు. అప్పట్లో మద్రాసులోని తెలుగు చిత్రసీమతో పాటు తమిళ, తదితర పరిశ్రమల్లోనూ అది పెద్ద సంచలనమైంది. ఆయన పెద్దకుమారుడి పేరు - రామ్‌ప్రసాద్. రెండో కుమారుడు - యోగేంద్రకుమార్, మూడో కుమారుడు జగపతిబాబుకు తన తండ్రి పేరునే పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్. తరువాతి కాలంలో కుమారుడు జగపతిబాబును ‘సింహస్వప్నం’ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశారు. హీరో కావాలన్న తన చిన్నప్పటి కోరికను అలా కుమారుడి రూపంలో తీర్చుకున్నారు.

 

 ఆధ్యాత్మిక చింతనలో...

 చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారి, నష్టాలు వచ్చాక ఆయన క్రమంగా చిత్ర నిర్మాణానికి దూరం జరిగారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక, ఇక్కడి ‘ఫిలిమ్‌నగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో కీలక బాధ్యతలు పోషించారు. అలాగే, జీవితంలోని చివరి అంకాన్ని పూర్తిగా దైవభక్తిలో గడిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఫిలిమ్‌నగర్‌లో ఫిల్మ్‌చాంబర్ పక్కనే కొండపై నెలకొన్న దేవాలయాల సముదాయం ‘దైవసన్నిధానం’ నిర్మాణంలో ఆయన ముఖ్యపాత్ర వహించారు. చిత్రసీమకు చేసిన సేవకు గుర్తింపుగా 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. కాగా, సీనియర్ సినీ జర్నలిస్టు భగీరథ ఈ సినీ దిగ్గజం జీవిత చరిత్రకు ‘దసరా బుల్లోడు’ పేరిట పుస్తకరూపం ఇవ్వడం విశేషం. చిన్నప్పటి నుంచి ఉబ్బసంతో బాధపడుతూ, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ వచ్చిన రాజేంద్రప్రసాద్ సోమవారం రాత్రి కన్నుమూయడంతో పాత తరం ప్రముఖ దర్శక, నిర్మాతల్లో మరొకరు కనుమరుగయ్యారు. ఇవాళ ఆయన లేరు... కానీ, ఆయన సినిమాలు, వాటిలోని పాటలు మాత్రం తెరస్మరణీయంగా మిగిలిపోయాయి.

 

 టాప్ 5 మూవీస్

 ఆరాధన (1962): సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పెర్‌మెంట్

 చాలా రిస్కీ కథాంశమిది. సినిమా సగంలో కథానాయకుడు గుడ్డివాడవుతాడు. ఏయన్నార్‌లాంటి రొమాంటిక్ హీరోతో ఇలాంటి సినిమా చేయడమంటే సముద్రంలో ఈత కొట్టడంలాంటిదే. దర్శక, నిర్మాత బీఎన్ రెడ్డి సగం షూటింగ్ అయ్యాక రష్ చూసి ‘మీ ప్రయత్నం వృథా’ అని హెచ్చరించినా, వీబీ రాజేంద్రప్రసాద్ వెన్ను చూపలేదు. కథే శ్రీరామరక్ష అనుకున్నారు. ఆయన మొండితనం, సాహసం ఫలించింది. ‘ఆరాధన’ సినీ చరిత్రలో నిలిచిపోయింది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘ఆడదాని ఓరచూపులో’, ‘వెన్నెలలోని వికాసమే’ లాంటి గొప్ప గొప్ప పాటలు ఇందులోవే.

 

 ఆత్మబలం (1964): వండర్‌ఫుల్ థ్రిల్లర్

 ఒక్క పాటతో హిస్టరీలో నిలిచిపోవడం, హిస్టరీగా మారడం అంటే ఇదేనేమో! ఈ సినిమా పేరు చెప్పగానే ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట గుర్తుకు రాకపోతే ఒట్టు. ఈ సినిమా లేకపోతే జగపతి సంస్థ లేదు. ‘ఆరాధన’ తర్వాత ప్రధాన భాగస్వామి చనిపోవడం, ఇతర భాగస్వాములు దూరమవడంతో ఒంటరైపోయారు వీబీ రాజేంద్రప్రసాద్. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి. వీబీ రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నారు. అలా ‘ఆత్మబలం’ మొదలు పెట్టారు. హిట్టుకొట్టారు. ఇందులో ఏడు పాటలూ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.

 

 అదృష్టవంతులు (1969): అడ్వాన్స్‌డ్ యాక్షన్

 ఏయన్నార్‌తో చేసిన యాక్షన్ సినిమా ఇది. మేకింగ్ చాలా అడ్వాన్డ్స్ థాట్స్‌తో ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్రెయిన్ ఫైట్ అయితే ఎక్స్‌లెంట్. గ్లామర్ హీరోయిన్ జయలలితతో మేల్ కేరెక్టర్ చేయించాలనుకోవడం తమాషా ఆలోచన. ఇందులో జగ్గయ్య విలన్‌గా చేశారు. ఆయన డెన్‌ని సీసీ టీవీలతో మోడ్రన్‌గా డిజైన్ చేయించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జునకు ఈ సినిమాలో యాక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విలన్ డెన్ సెటప్ ఆయనకు తెగ నచ్చేసింది.

 

 దసరా బుల్లోడు (1971): బాక్సాఫీస్‌కి న్యూ బ్లడ్

 ఈ సినిమాతో అనుకోకుండా దర్శకుడయ్యారు వీబీ రాజేంద్రప్రసాద్. ‘జగపతి’ సంస్థ ఆస్థాన దర్శకుడైన వి. మధుసూధనరావు బిజీగా ఉండటంతో తానే మెగాఫోన్ పట్టాల్సి వచ్చింది. తొలి షెడ్యూలు కృష్ణా జిల్లాలో తీస్తే, రష్ మొత్త పోయింది. మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా అంతా దాదాపుగా అవుడ్డోర్‌లోనే తీశారు. సినిమా సూపర్‌హిట్టయ్యింది.అక్కినేని స్టెప్పుల హవా మొదలైంది ఈ సినిమాతోనే. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా’, ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్’ తదితర పాటల కోసం కుర్రకారు వేలంవెర్రిగా ఎగబడ్డారు. అక్కినేని-వాణిశ్రీ కాంబినేషన్, పాటలు, స్టెప్పులు, మాటలు, మాస్ ఎలిమెంట్స్, మేకింగ్ వేల్యూస్‌తో బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిసింది. ఈ సినిమా విజయంతో వీబీ రాజేంద్రప్రసాద్ విజృంభించి దర్శకునిగా 17 సినిమాలు తీశారు. ‘దసరాబుల్లోడు’ని హిందీలో జితేంద్ర, రేఖ, షబనా ఆజ్మీతో ‘రాస్తే ప్యార్’గా రీమేక్ చేసి విజయం సాధించారు.

 

 బంగారు బాబు (1973): గెస్ట్ మల్టీ స్టారర్

 ఓ సినిమా హీరోయిన్ పారిపోయి రహస్యంగా ఓ స్టేషన్ మాస్టర్ దగ్గర ఆశ్రయం పొందుతుంది. జీవితంలో కొంగొత్త రుచులేంటో చూస్తుంది. ఇదీ ‘బంగారు బాబు’ సినిమా కథ. అప్పట్లో ప్రేక్షకులకు చాలా కిక్కిచ్చిన కథ ఇది. ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది’ అంటూ ఏయన్నార్, వాణిశ్రీ పాడిన డ్యూయెట్ ఇప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రముఖ నటులు శివాజీ గణేశన్, రాజేష్‌ఖన్నా, కృష్ణ, శోభన్‌బాబులు గెస్ట్‌లుగా కనిపించడం అప్పట్లో నిజంగా గ్రేట్.

 

 జగమెరిగిన ‘జగపతి’వారి పాటలు

 చిటపట చినుకులు పడుతూ వుంటే - ఆత్మబలం (1964)

 ఎక్కడికి పోతావు చిన్నదానా - ఆత్మబలం

 నువ్వంటే నాకెందుకో అంత ఇది - అంతస్తులు (1965)

 అయ్యయ్యో బ్రహ్మయ్య - అదృష్టవంతులు (1968)

 మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో -  అదృష్టవంతులు

 ము.. ము... ముద్దంటే చేదా -  అదృష్టవంతులు

 చిటాపటా చినుకులతో కురిసింది వాన - అక్కాచెల్లెలు (1970)

 పాండవులు పాండవులు తుమ్మెద - అక్కాచెల్లెలు

 నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే - దసరా బుల్లోడు (1971)

 పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ - దసరా బుల్లోడు

 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది - బంగారుబాబు (1973)

 ఏడడుగుల సంబంధం - బంగారుబాబు

 నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని -

 మంచి మనుషులు (1974)

 నీవు లేక నేను లేను - మంచి మనుషులు

 నేనీ దరిని నువ్వా దరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ -

 బంగారు బొమ్మలు (1977)

 చిటపట చినుకుల మేళం - ముద్దుల కొడుకు (1979)

 దులపర బుల్లోడా - ఆస్తిపరులు (1964)


ప్రియా ప్రియతమా రాగాలు - కిల్లర్ (1991)


 


 


 




 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top