మళ్లీ ఏక్‌ దో తీన్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ ఏక్‌ దో తీన్‌

Published Fri, Feb 9 2018 12:22 AM

Jacqueline Fernandez to recreate Madhuri Dixit’s Ek Do Teen for Baaghi 2 - Sakshi

‘‘ఏక్‌ దో తీన్‌..’’  అనగానే మనందరికి గుర్తొచ్చేది మాధురీ దీక్షిత్‌. మోహినిగా తను వేసిన స్టెప్పులను   దశాబ్దాలు దాటిపోయినా ఎవ్వరూ మరచిపోయి ఉండరు. మాధురీ దీక్షిత్‌ను ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మార్చేసి, డ్యాన్సింగ్‌ క్వీన్‌ అంటూ బాలీవుడ్‌ అభిమానుల కితాబులు పొందేలా చేసిందీ సాంగ్‌. ప్రస్తుతం‘భాగీ 2’ చిత్రం కోసం ఆ పాటను రీమిక్స్‌ చేస్తున్నారు. నయా మోహినిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు.  టైగర్‌ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న చిత్రం ‘భాగీ 2’.

2016లో వచ్చిన ‘భాగీ’ చిత్రానికి ఇది సీక్వెల్‌. అప్పుడు మాధురీ కోసం ప్యారీలాల్‌ కంపోజ్‌ చేసిన ఆ పాటకు సరోజ్‌ ఖాన్‌ కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు సరోజ్‌ ఖాన్‌  శిష్యుడు, ‘భాగీ 2’ చిత్ర దర్శకుడు ఈ పాటను రీమిక్స్‌ చేయాలనుకోవడం విశేషం. ‘ఏక్‌ దో తీన్‌...’ సాంగ్‌లో సైడ్‌ డ్యాన్సర్‌గా కనిపించిన గణేష్‌ ఆచార్యనే ఈ రీమిక్స్‌కు కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఈ సాంగ్‌ రీమిక్స్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఏక్‌ దో తీన్‌’ అనే పాట ఆల్‌ టైమ్‌ హిట్‌.

గణేష్‌ మాస్టర్‌ను సేమ్‌ సరోజ్‌ ఖాన్‌ స్టైల్‌లోనే కంపోజ్‌ చేయమని అడిగాను. అలాగే మాధురీ దీక్షిత్‌ ధరించిన పింక్‌ కలర్‌ డ్రెస్‌ను దృష్టిలో ఉంచుకొనే జాక్వెలిన్‌కు డ్రెస్‌ డిజైన్‌ చేయమని మనీష్‌ మల్హోత్రాను కోరాను. జాక్వెలిన్‌తో ఇంతకు ముందు ‘కిక్‌’లో ‘జుమ్మే కీ రాత్‌ హై’, ‘రాయ్‌’ సినిమాలో ‘చిట్టియన్‌ కలయ్యా’ వంటి సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ చేశాం. ఆమె ఫెంటాస్టిక్‌ డ్యాన్సర్‌. అందుకే ‘ఏక్‌ దో...’ సాంగ్‌ను రీక్రియేట్‌ చేయటానికి జాక్వెలిన్‌ మంచి ఛాయిస్‌ అనుకున్నాను’’ అన్నారు. ఈ సాంగ్‌ను మూడు రోజులు షూట్‌ చేస్తారట. ‘భాగీ 2’ మార్చి 30న విడుదల కానుంది.

మాధురీ దీక్షిత్‌ గురించి సరోజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ – ‘‘బేసిక్‌గా మాధురీ కథక్‌ డ్యాన్సర్‌. అందుకే బాలీవుడ్‌ స్టైల్‌ పాటలను అడాప్ట్‌ చేసుకోవటానికి కొంచెం ఇబ్బంది పడేవారు. ‘ఏక్‌ దో...’ సాంగ్‌ను నేను కేవలం 20 నిమిషాల్లో కంపోజ్‌ చేశాను. కానీ ఆ హిప్‌ మూమెంట్స్‌ను క్యాచ్‌ చేయటానికి ఆమె బాగా కష్టపడ్డారు. దానికోసం పదిహేడు రోజులు ప్రాక్టీస్‌ చేద్దాం అనుకున్నాం. ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ ప్రాక్టీస్‌ చేసేవారు. పదో రోజు కల్లా తన స్టెప్స్‌లో పర్ఫెక్ట్‌ అయ్యారు మాధురి. ఇక ప్రాక్టీస్‌కు రావద్దులే అంటే మిగతా 7 రోజులు కూడా డ్యాన్స్‌ స్టూడియోకి వచ్చి ప్రాక్టీస్‌ చేస్తూనే ఉండేవారామె’’ అన్నారు.

Advertisement
Advertisement