సారథిగా చివరిసారి | India vs England: MS Dhoni to captain one last time in Tuesday's practice match | Sakshi
Sakshi News home page

సారథిగా చివరిసారి

Jan 10 2017 1:39 AM | Updated on Sep 2 2018 5:28 PM

సారథిగా చివరిసారి - Sakshi

సారథిగా చివరిసారి

భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్‌ ధోని మళ్లీ తన నాయకత్వ బాధ్యతలు ప్రదర్శించేందుకు మరో అవకాశం లభించింది.

వార్మప్‌ మ్యాచ్‌కు నాయకత్వం వహించనున్న ధోని
నేడు భారత్‌ ‘ఎ’తో ఇంగ్లండ్‌ ఎలెవన్‌ పోరు  


ముంబై: భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్‌ ధోని మళ్లీ తన నాయకత్వ బాధ్యతలు ప్రదర్శించేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే రెండు వార్మప్‌ మ్యాచ్‌లలో మొదటిదాంట్లో బరిలోకి దిగుతున్న అతను, భారత్‌ ‘ఎ’ జట్టు కెప్టెన్‌ హోదాలోనే ఆడుతున్నాడు. మంగళవారం ఇక్కడి బ్రబోర్న్‌ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’తో ఇంగ్లండ్‌ ఎలెవన్‌ తలపడుతుంది. దేశవాళీ క్రికెట్‌లో కూడా మెంటార్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్న ధోని, బహుశా ఒక మ్యాచ్‌లో నాయకత్వం వహించడం ఇదే ఆఖరిసారి కావచ్చు. రెండో మ్యాచ్‌లో ‘ఎ’ జట్టు గురువారం అజింక్య రహానే నేతృత్వంలో బరిలోకి దిగుతుంది. బీసీసీఐలోని పెద్దలను సుప్రీం కోర్టు తప్పించిన తర్వాత ఏ స్థాయిలోనైనా భారత ఆటగాళ్లు పాల్గొంటున్న తొలి మ్యాచ్‌ ఇదే కాగా... ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. జాతీయ సెలక్టర్లలో ఒకరైన జతిన్‌ పరాంజపే ఈ మ్యాచ్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

యువీపైనే దృష్టి...
వార్మప్‌ మ్యాచ్‌లో అందరి దృష్టీ ప్రధానంగా యువరాజ్‌ సింగ్‌పైనే నిలిచింది. టి20 ఫార్మాట్‌లో ఆఖరిసారిగా ప్రపంచకప్‌లో ఆడినా, అతను వన్డేలు ఆడి మూడేళ్లు దాటింది. పోటీ క్రికెట్‌కు సంబంధించినంత వరకు రెండు నెలల క్రితం ఆఖరిసారిగా రంజీ ట్రోఫీలో అతను ఆడాడు. కాబట్టి ఆటకు దూరం కాలేదు. వన్డేలకు ముందు అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడుంది. అదే విధంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా టెస్టు జట్టులో పోటీ ఉండటంతో స్థానం దక్కించుకోలేకపోయిన శిఖర్‌ ధావన్‌ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగొస్తున్న ఆశిష్‌ నెహ్రాతో పాటు యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్యాకు కూడా ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. ధోని కూడా అక్టోబర్‌లో వైజాగ్‌ వన్డే తర్వాత మళ్లీ బ్యాట్‌ పట్టలేదు. కాబట్టి అతనికి కూడా వన్డే, టి20 సిరీస్‌లకు ముందు ప్రాక్టీస్‌ అవసరం. ఇక సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన అంబటి తిరుపతి రాయుడు, మోహిత్‌ శర్మ తదితర ఆటగాళ్లకూ ఇదో మంచి అవకాశం.

జట్టు మారిపోయింది...
ఇంగ్లండ్‌ జట్టు టెస్టుల్లో చిత్తుగా ఓడినా, వన్డేల్లో దానిని తక్కువ చేయడానికి వీలు లేదు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్లలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. స్పెషలిస్ట్‌ ఆటగాళ్లతో ఉన్న ఆ జట్టు, వార్మప్‌ మ్యాచ్‌తోనే తమ జోరు మొదలు పెట్టాలని భావిస్తోంది. బిగ్‌ బాష్‌ లీగ్‌ నుంచి నేరుగా ఇక్కడకు వచ్చిన ఇయాన్‌ మోర్గాన్, హేల్స్, రాయ్, విల్లీ దూకుడు మీదున్నారు. ప్రధాన సిరీస్‌కు ముందు రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. టెస్టు టీమ్‌తో పోలిస్తే అనేక మంది విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉండటం ఇంగ్లండ్‌ బలం. భారత గడ్డపై తొలి వార్మప్‌లో వారు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరం. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఇంకా భారత్‌కు చేరుకోని ఇంగ్లండ్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
 
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో
 ప్రత్యక్ష ప్రసారం

Advertisement
 
Advertisement
Advertisement