
‘‘విక్రమ్ నాకు మంచి స్నేహితుడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్టార్‌గా ఎదిగారు. 25 ఏళ్ల క్రితం తనని కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి సినిమాలు అవసరం. మంచి చిత్రాలు రాకుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు రారు. ‘స్కెచ్’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు నిర్మాత డి.సురేశ్‌బాబు. విక్రమ్, తమన్నా జంటగా విజయ్‌చందర్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించిన చిత్రం ‘స్కెచ్’. తమిళంలో హిట్ టాక్‌తో దూసుకెళుతున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేశ్‌బాబు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రచార చిత్రాలు రిలీజ్ చేశారు. విక్రమ్ మాట్లాడుతూ –‘‘బంగారు కుటుంబం’ షూటింగ్‌లో నేను ఓ పక్కన నిలబడి ఉంటే, వెంకటేశ్‌గారు పిలిచి మరీ నాతో బాగా మాట్లాడారు.
నేను పెద్ద హీరో అయినా ఆయనలా ఉండాలని ఆ రోజే అనుకున్నా. ఇక ‘స్కెచ్’ విషయానికొస్తే.. కథ వినగానే థ్రిల్ అయ్యాను. కమర్షియల్ టైప్‌లో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. వరుసగా విభిన్నమైన సినిమాలు చేస్తున్న నేను దాదాపు పదిహేనేళ్ల తర్వాత కమర్షియల్ మూవీ చేశా. ఇందులో పాత విక్రమ్‌ని చూస్తారు’’ అన్నారు. ‘‘విక్రమ్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా ’’ అన్నారు తమన్నా. ‘‘తమిళంలోలానే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు విజయ్‌చందర్.