ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్! - ఆర్.సి.ఎం.రాజు

ఎస్పీ బాలుకి డబ్బింగ్ చెప్పాలనేది నా డ్రీమ్!  -  ఆర్.సి.ఎం.రాజు

ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సినిమా చూశారుగా. అందులో గోదావరి పుష్కరాల సన్నివేశంలో ప్రత్యర్థుల్ని ఎన్టీఆర్ తెగ నరుకుతుంటాడు. ఆ సందర్భంలో ఎన్టీఆర్‌ని చూసిన శరత్‌సక్సేనా భావోద్వేగానికి లోనై.. ‘సింగమలై అన్నా...’ అని అరుస్తాడు. ఆ డైలాగు చాలా చిన్నదే. కానీ అందులోని ఉద్వేగం జనాలను కట్టిపడేసింది. ఆ డైలాగ్ చెబుతూ తెరపై మనకు కనిపించింది శరత్‌సక్సేనా. కానీ వెనకున్న వ్యక్తి వేరు. అతనే... అనువాద కళాకారుడు ఆర్.సి.ఎం.రాజు. ప్రతినాయక  పాత్రధారులకు తన కంఠాన్ని అరువిస్తూ... ఆయా పాత్రలకు తన గొంతుతో ప్రాణ ప్రతిష్ట చేస్తున్న రాజుతో ‘సాక్షి’ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్‌వ్యూ ఇది. 

 

 అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారా? లేక అనుకునే అయ్యారా? 

 ‘అనుకోకుండా’ అని చెప్పలేను, ‘అనుకునే’ అని చెప్పలేను. అయితే.. అంతా తెలిసే జరిగిందని మాత్రం చెప్పగలను. మా నాన్నగారి పేరు ఆర్.సుబ్బరాజు. రిటైర్డ్ సబ్‌ఇన్‌స్పెక్టర్. అమ్మ జయమ్మ హౌస్‌వైఫ్. అమ్మకు నన్ను కళాకారుణ్ణి చేయాలని కోరిక. చిన్నప్పుడే స్టేజ్ షోలు చేస్తుండేవాణ్ణి. కాలేజ్ టైమ్‌లో అయితే మిమిక్రీ షోలు చేశాను. ఓ ఆర్కెస్ట్రా కూడా నడిపా. అప్పట్లో ఉపన్యాస పోటీలు ఎక్కడ జరిగినా మొదటి బహుమతి నాదే. మొదట్నుంచీ నా పెర్‌ఫార్మెన్స్ కంటే... గాత్రానికే ఎక్కువ ప్రశంసలొచ్చేవి. జనం ఆదరిస్తుంటే అర్థమైంది... నా గాత్రంలో ఏదో గమ్మత్తు ఉందని. చివరకు ఆ గాత్రమే ఈ రోజు నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది. 

 

 అసలు డబ్బింగ్ రంగంలోకి ఎలా వచ్చారు? 

 నా లక్ష్యం ఆలిండియా రేడియో ఎనౌన్సర్ అవ్వడం. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మా ఊరు. అక్కడే డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేరా. అక్కడ చదువుతున్నప్పుడే... ‘యువవాణి’ కార్యక్రమానికి ఆలిండియా రేడియో వారు ఆడిషన్స్‌కి పిలిచారు. అప్పుడే.. యాదృచ్ఛికంగా ‘రుతురాగాలు’ సీరియల్‌లో నగేష్ కర్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం లభించింది.

 

 మరి సినిమా అవకాశం...?

 నాగార్జున ‘ఆటో డ్రైవర్’ సినిమాకు డబ్బింగ్ శాఖలో పనిచేశా. ‘ఆనందం’(2000) సినిమాలో వెంకట్ పాత్రకు డబ్బింగ్ చెప్పాను. అదే నా తొలి బ్రేక్ 

 

 అనువాద కళాకారునిగా  మీకు పేరు తెచ్చిన సినిమాలు?

 నరసింహనాయుడు, ఇంద్ర, సింహాద్రి, పోకిరి... ఇలా ఎన్నో ఉన్నాయి. రవిశంకర్‌గారు బిజీగా ఉంటే.. డబ్బింగ్ ఇన్‌చార్జ్‌లు నాతో చెప్పించేవారు.

 

 మీరు ఛాలెంజ్‌గా తీసుకొని డబ్బింగ్ చెప్పిన సినిమాలు?

 ‘రక్తచరిత్ర’లో వివేక్ ఓబెరాయ్‌కి, ‘రక్త కన్నీరు’లో ఉపేంద్రకి డబ్బింగ్ చెప్పాను. ఆ రెండు పాత్రలకీ డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డా

 

 ఎందరో నటులకు గాత్రదానం చేశారు. మరి మీరే ఎందుకు నటించకూడదు?

 నటనలో భాగమే డబ్బింగ్. అయితే.. అనువాద రంగంలో బిజీ అయ్యాక... నటుడు అవ్వాలని మనసులో ఉన్నా అవ్వలేని పరిస్థితి. ఇటీవలే ‘అవతారం’ చిత్రానికి డబ్బింగ్ చెబుతుంటే.. కోడి రామకృష్ణగారు అడిగారు.. ‘నటిస్తావా..’ అని. చేస్తానని చెప్పేశా. నేడో రేపో ఆయన నుంచి ఫోన్ రావచ్చు. 

 

 ప్రస్తుతం ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పారు?

 ‘ఎవడు’లో రాహుల్‌దేవ్‌కి, ‘అత్తారింటికి దారేది’లో ముఖేష్‌రుషికి, ‘భాయ్’లో ఆశిష్‌విద్యార్థికి, కోడిరామకృష్ణ ‘అవతారం’లో సత్యప్రకాష్‌కి.

 

 అన్నీ విలన్లకేనా. హీరోలకు చెప్పలేదా?

 మమ్ముట్టి, మోహన్‌లాల్‌లకు చెప్పేశాను. మలయాళం డబ్బింగ్ ‘4ఫ్రెండ్స్’ చిత్రానికి గాను కమల్‌హాసన్‌కి కూడా చెప్పాను. 

 

 ఇంకెవరికైనా డబ్బింగ్ చెప్పాలని కోరిక ఉందా?

 ఎస్పీ బాలుగారికి చెప్పాలి. ఆయనంత గొప్పగా డబ్బింగ్ చెప్పడమంటే ఛాలెంజే. ఆయనకు డబ్బింగ్ చెప్పాలన్న కోరిక ఎప్పుడు తీరుతుందో! 

 

 అవార్డులేమైనా అందుకున్నారా?

 ‘పురాణ గాథలు’, ‘మొగలిరేకులు’ సీరియల్స్‌కి నందులు అందుకున్నాను. సినిమాల విషయానికొస్తే... ‘డార్లింగ్’ చిత్రంలో ముఖేష్‌రుషికి, ‘పోరు తెలంగాణ’లో నటుడు జమకి చెప్పిన డబ్బింగ్‌లకు నందులొచ్చాయి.  

 

 డబ్బింగ్ కళ ఒకప్పుడు ఉన్నంత ఉన్నతంగా ఇప్పుడుందంటారా?

 ఇప్పుడు కూడా మంచి డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. జగ్గయ్య, పీజేశర్మ లాంటి వాళ్లు డబ్బింగ్ కళకు వన్నె తెస్తే... సాయికుమార్, రవిశంకర్ లాంటి వాళ్లు దాన్ని ఓ అత్యున్నత స్థానంలో నిలబెట్టారు. వాళ్లందరూ నాకు ఆదర్శమే. 

 

 డబ్బింగ్ చిత్రాల్ని, సీరియల్స్‌ని రద్దు చేయాలనే ఉద్యమంపై మీ అభిప్రాయం?

 సమర్థించలేను. ఖండించనూ లేను. ఫలితం ఏదైనా శిరసావహిస్తానంతే.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top