‘సైరా’ను ఆపలేం.. తేల్చిచెప్పిన హైకోర్టు

High Court Green Signal To Chiranjeevi Sye Raa Movie In Telangana - Sakshi

ఈ మధ్యకాలంలో సినిమాలను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పాడుతున్నాయి. గతంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమా విడుదల చివరి రోజు వరకు ఉత్కంఠ నెలకొంది. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు సినిమా పేరు మార్చి చిత్ర యూనిట్‌ పెద్ద ధైర్యమే చేసిన విషయం తెలిసిందే.  తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా భారీగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కూడా వివాదాలు చుట్టుముట్టాయి. బయోపిక్‌ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ‘సైరా’ విడుదలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. 

ఈ వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు తన తుది తీర్పును మంగళవారం వెలువరించింది. ఇరువర్గాల వాదనను విన్న హైకోర్టు ‘సైరా’ సినిమా విడుదలను ఆపలేమని తేల్చిచెప్పింది. ‘సైరా’చిత్రంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాను కేవలం వినోద పరంగానే చూడాలని పిటిషనర్‌కు సూచించింది. ఎంతో మంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారని ప్రశ్నిస్తూనే.. గతంలో గాంధీ, మొఘల్‌ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ప్రస్తావించింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని తెలిపింది. ప్రస్తుతం సినిమాను తాము ఆపలేమంటూ ఫిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో సైరా సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రంపై వచ్చిన తొలి రివ్యూతో ‘సైరా’ చిత్ర యూనిట్‌ ఆనందంలో ఉండగానే.. హైకోర్టు తీర్పు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తోందని చిత్ర సభ్యులు పేర్కొన్నారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘సైరా’ రేపు(బుధవారం) గాంధీ జయంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top