
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్లున్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన వీళ్లిద్దరు కలిసి ఒక అవేర్‌నేస్ ప్రోగ్రామ్ కోసం పని చేయనున్నారు. విరాట్ కోహ్లీ అంటే ప్రస్తుతం క్రికెట్‌లో ఓ బ్రాండ్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. తాత అడుగు జాడల్లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖ జాతీయ చానల్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోహ్లితో ఎన్టీఆర్ చేతులు కలపనున్నారు.
ఇప్పటికే రోడ్డు ప్రమాదాల గురించి తన ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు వాయిస్ ఓవర్ రూపంలో తారక్ చెబుతూనే ఉంటాడు. ప్రతి సినిమా ఈవెంట్ లో కూడా తన అభిమానులను క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరే విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఏడుగురు సెలబ్రిటీలు ఈ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో భాగం కానున్నారని సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి చెందిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.