ఈ ప్రేమికులరోజు అంజలితో కాదు.. ఆయనతో.. | Hero Jai Special Interview On Valentines Day | Sakshi
Sakshi News home page

ప్రేమికులరోజు ఆయనతో..

Published Wed, Feb 13 2019 12:00 PM | Last Updated on Wed, Feb 13 2019 12:00 PM

Hero Jai Special Interview On Valentines Day - Sakshi

సినిమా: ప్రేమికుల రోజును ఆయనతో జరుపుకోనున్నట్లు నటుడు జై చెప్పారు. జై ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు బంధువు. ఈయనలోనూ సంగీత కళాకారుడు ఉన్నాడు. అవును జై కీబోర్డు ప్లేయర్‌.అలాంటిది నటుడిగా  రాణించడం   విశేషం. ఈ సంచలన నటుడి గురించి రకరకాల ప్రచారం జరుగుతుంటుంది. షూటింగ్‌లకు సకాలంలో రారని, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరని, నటి అంజలితో ప్రేమ వ్యవహారం లాంటి ప్రచారం దుమారం రేపుతుంటుంది. అయినా నటుడిగా జై క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ఇటీవల నటించిన బెలూన్,కలగలప్పు–2 చిత్రాలు సక్సెస్‌ అయ్యా యి. ఇప్పటికీ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా మాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఈ సందర్భంగా నటుడు జై మంగళవారం చెన్నైలో మీడియాతో మీట్‌ అయ్యారు.

ప్ర: మీ సినీ ఎంట్రీ గురించి?
జ: 2002లో నటుడు విజయ్‌ నటించిన భగవతి చిత్రంలో ఆయనకు తమ్ముడిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తరువాత స్టెప్‌ బై స్టెప్‌ నటుడిగా నన్ను నేను పెంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను.

ప్ర: హీరోగా అవకాశం గురించి.?
జ: గాయకుడు, నటుడు చరణ్‌ నాకు మంచి మిత్రుడు. ఆయన నిర్మిస్తున్న చెన్నై 28 చిత్రానికి ఆడిషన్‌ జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళ్లాను. అయితే అక్కడికి వెళ్లే వరకూ ఆ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకుడన్న విషయం తెలియదు. ఆయన నాకు దగ్గర బంధువే. అలా చెన్నై–28 చిత్రం ద్వారా నలుగురు హీరోల్లో ఒకరిగా పరిచయం అయ్యాను.

ప్ర:ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల వివరాలు?
జ:వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా నీయా–2 చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇది పాము ఇతివృత్తంతో కూడిన కథా చిత్రమే అయినా గతంలో వచ్చిన నీయా చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను నటిస్తున్న మరో చిత్రం కరుప్పనగరం. ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఇందులో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుంది. ఒక పాత్రలో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటిస్తున్నాను.

ప్ర: కొత్తగా మాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లున్నారు?
జ:అవును మలయాళంలో మమ్ముట్టికి తమ్ముడిగా మదురైరాజాఅనే చిత్రంలో నటిస్తున్నాను. చాలా మంచి పాత్ర. ఈ చిత్రంతో మలయాళంలో హీరోగా మంచి అవకాశాలు వస్తాయని మమ్ముట్టి ప్రశంసించారు.

ప్ర:శింబు హీరోగా వెంకట్‌ప్రభు తెరకెక్కించబోతున్న మనాడు చిత్రంలో మీరు నటించబోతున్నట్లు ప్రచారం గురించి?
జ: వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించే అన్ని చిత్రాల్లోనూ నేను ఏదో ఒక పాత్రలో నటించాను. ఒక్క చిత్రంలో మినహా. అదే విధంగా మనాడు చిత్రంలోనే ఒక కీలక పాత్రలో నటిస్తాను.

ప్ర:నటుడు విజయ్‌ నటించిన భగవతి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. మరోసారి ఆయనతో నటించే అవకాశం ఉందా?
జ: విజయ్‌తో కలిసి నటించాలన్న కోరిక నాకూ ఉంది. భగవతి చిత్రంలో మాదిరి మంచి పాత్ర లభిస్తే విజయ్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా.

ప్ర: నటి అంజలితో కలిసి నటిస్తున్నారా?
జ:లేదు.

ప్ర: ప్రేమికుల రోజును ఎవరితో జరుపుకోనున్నారు?
జ: ఈ సారి ప్రేమికుల రోజును ఒంటరిగానే జరుపుకోనున్నాను. ఇంకా చెప్పాలంటే ఆ రోజు మలయాళ చిత్రం మదురై రాజా షూటింగ్‌ చివరి రోజు. ఆ రోజు మమ్ముట్టితో కలిసి నటించనున్నాను.

ప్ర: ఈ ఏడాది ఓ ఇంటి వాడు అయ్యే అవకాశం ఉందా?
జ: చెప్పలేను. ఎందుకంటే పెళ్లి గురించి ఇంకా నిర్ణయించుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement