గీతమ్మా... నువ్వెవ‌రమ్మా?

Funday special chit chat with bhairava geetha movie heroine - Sakshi

రామ్‌గోపాల్‌వర్మ సమర్పించడం, ‘నాకు స్పెషల్‌ సినిమా’ అని చెప్పుకోవడం, డైరెక్టర్‌ని పొగడ్తలతో ముంచెత్తడం... తదితర కారణాల వల్ల ‘భైరవగీత’  మీద ప్రేక్షకుల ఆసక్తి ప్రసరించింది.  ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశిస్తున్న ఐరా మోర్‌  తన గురించి  చెప్పిన ముచ్చట్లు...

ఏమవుతుందో ఏమో!
మా కుటుంబంలో అందరూ పెద్ద చదువుల వారే. నాన్న లాయర్‌. అమ్మ ప్రొఫెసర్‌. సిస్టర్‌ డాక్టర్‌. బ్రదర్‌ ఇంజనీర్‌. నాన్న చాలా స్ట్రిక్ట్‌. సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. థియేటర్‌తో మాత్రం పరిచయం ఉంది. ‘ఇక ఎలాగైనా సినిమాల్లో నటించాలి’ అని నిర్ణయించుకున్నాక అమ్మానాన్నలకు చెప్పాలనుకున్నా. కానీ భయం. చెప్పాలా?  వద్దా? చెబితే తిడతారేమో!అసలే నాన్న పరమ స్ట్రిక్ట్‌. ఇక ఇలా కాదని ఒక మంచిరోజు చూసి ధైర్యం చేసి అడిగాను. అయిదు నిమిషాలు కూడా ఆలోచించకుండానే నాన్న ఓకే చెప్పేశారు. నాకు ఆశ్చర్యం, బోలెడు ఆనందం కలిగాయి. అమ్మా,నాన్నలు చదువుకున్న వాళ్లు, లోకం తెలిసిన వాళ్లు, వారికి ఏది మంచి నిర్ణయం ఏది కాదు అనేది తెలియంది కాదు కదా!

నేనే గీత
వర్మ  ‘ఫ్రెష్‌ ఫేస్‌’ కోసం చూస్తున్నారని తెలిసి ఆడిషన్‌కి వెళ్లాను. రెండు మూడు ఆడిషన్‌ల తరువాత ‘భైరవగీత’లో గీత పాత్రకు ఎంపికయ్యాను. లండన్‌ నుంచి సొంతూరుకు వస్తుంది గీత. బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్ర. నిజజీవితంలో నేను కూడా ఇంతే. గీత పాత్ర చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది.

కాస్త బెరుకు!
థియేటర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చాను కాబట్టి నటన అంటే భయం లేదు. అయితే కొన్నిసార్లు కెమెరాను ఫేస్‌ చేస్తున్నప్పుడు బెరుకుతో చేతులకు చెమటలు పట్టేవి. ప్రిపేర్‌ కానప్పుడే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది. చేయబోయే సీన్‌ గురించి హోంవర్క్‌ చేసినప్పుడు ఎలాంటి  బెరుకు లేకుండా నటించేదాన్ని.

పరుగో పరుగు
‘భైరవగీత’లో పరుగెత్తే దృశ్యాలు ఉన్నాయి. కాళ్లకు ఇబ్బంది కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అందని మారుమూలప్రాంతంలో షూటింగ్‌ చేసినప్పుడు ఒంటరిగా ఫీలయ్యాను. అయితే ఇది తాత్కాలికమే. ముద్దు సన్నివేశం చేయడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ‘‘నవ్వైనా, ఏడుపైనా, ముద్దు అయినా..ఇదంతా సినిమాలో భాగంగానే చేస్తాం. వాటిని ఆ క్షణంలోనే మరిచిపోవాలి. సీరియస్‌గా ఆలోచించవద్దు’’ అని హీరో ధనుంజయ్‌ చెప్పడంతో ‘నిజమే కదా’ అనిపించింది.

మంచి కథ చాలు
ఫలానా హీరోతో నటించాలనేదానికంటే మంచి కథ, ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాలనేది నా కోరిక. పాత్ర బలాన్ని తప్ప నిడివిని పట్టించుకోను. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే మహేశ్‌బాబు, రవితేజ సినిమాలు చూశాను. ‘అర్జున్‌రెడ్డి’ ‘మహానటి’ సినిమాలు కూడా చూశాను.  ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా అంటే ఇష్టం. మూడుసార్లు చూశాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top