
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్
తూర్పు గోదావరి, కొత్తపేట: రానున్న ఎన్నికల్లో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ప్రజలు పట్టం కడతారని ప్రముఖ సినీ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కొత్తపేటలో మిత్రుడు, ప్రముఖ పండితుడు పెద్దింటి రామం ఇంటికి వచ్చారు. ఆ సందర్భంగా పృథ్వీరాజ్ విలేఖరులతో మాట్లాడారు. రాజకీయాలు, సినీ అంశాలు ఆయన ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే..‘నేను 2014 నుంచి వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాను. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రం, చంద్రబాబు సీనియార్టీ, రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాననే బాబు హామీ నమ్మి ప్రజలు ఆయన ఓట్లేశారు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సంతోషంగా స్వీకరించాం. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు గమనించారు. ఆయనపై పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాసలయ్యాయి. దాంతో ప్రజల దృష్టి జగన్ వైపు మళ్లింది.
ఆయన పాలన కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలు, వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించేందుకు ఎండనకా, వాననకా, ఆరోగ్యం గురించి లెక్కచేయకుండా జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్నారు. దీంతో ప్రజలను దోచుకునే నాయకులు ఇంటికి పోతారు. ప్రజలకు సేవ చేసే నాయకులే అధికారంలోకి వస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, మడమతిప్పని, ప్రజా క్షేమం కోరుకున్న ఎన్‌టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డిల పాలన చూశాం. మళ్లీ వారి స్థానంలో ఆ తరహా పాలన అందించగల జగన్‌ను సీఎంగా చూస్తామన్నది నా ప్రగాఢ నమ్మకం. నీతి నిజాయితీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. సంతలో పశువులను కొన్నట్టు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. కానీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి వైఎస్సార్ సీపీలోకి వస్తానంటే ఆ పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్న జగన్ రాజకీయ విలువలకు అద్దం పట్టిన నాయకునిగా నిలిచారు. ప్రజలు జగన్ నాయకత్వ ఆవశ్యకతను బలంగా నమ్మి ఆయనకే పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారు.
శ్రీరెడ్డి వివాదం అర్ధరహితం
ఇటీవల తలెత్తిన శ్రీరెడ్డి వివాదం అర్ధరహితం. ఎవరో ఆమె వెనకుండి నడిపిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఏదేమైనా ఈ వివాదంలో మెగాస్టార్ చిరంజీవి తల్లిని విమర్శించడం బాధాకరం. చిరంజీవి ఫ్యామిలీలో అందరూ కష్టపడి పైకి వచ్చిన వారే. మహామనీషి దాసరి నారాయణరావు ఉంటే శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు మాట్లాడేవారు కాదు.
135 సినిమాల్లో నటించా
నేను 135 సినిమాల్లో నటించాను. ఖడ్గం సినిమా నుంచి నాకు గుర్తింపు లభించింది. అప్పటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ నా ఇంటిపేరుగా మారిపోయింది. ప్రస్తుతం రామ్‌చరణ్, అల్లరి నరేష్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా చేస్తున్న సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పోషిస్తున్నా.