నన్ను పెద్ద కొడుకు అనేవారు

Dasari Narayana Rao Bronze Statue In Palakollu - Sakshi

– దాసరి విగ్రహావిష్కరణలో మోహన్‌ బాబు

‘‘నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దాసరి అయితే నా కుటుంబానికి నెత్తిన పాలు పోసింది ఈ క్షీరపురి ప్రజలే’’ అని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్‌ బాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా స్థానిక గాంధీబొమ్మల సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్‌ బాబు మాట్లాడుతూ – ‘‘గురువు గారు దాసరి నారాయణరావు ‘నాకు ఏదైనా అయితే నా పెద్ద కొడుకు మోహన్‌ బాబు ఉన్నాడు’ అనేవారు. సినీ నటుడిగా జన్మనిచ్చిన తండ్రి విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో ఆవేదనతో కూడినది. నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నాను.. ఈ కార్యక్రమానికి నేను ఆనందంతో రాలేదు. ఎంతో బాధతో తప్పని పరిస్థితుల్లో వచ్చాను.

భక్తవత్సలంనాయుడు నామకరణంతో ఇండస్ట్రీలో ప్రవేశించిన నాకు 1975లో మోహన్‌ బాబుగా పేరు పెట్టారు. విలన్‌ గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌ గా, హీరోగా ఇలా అనేక క్యారెక్టర్లకు ఎంపిక చేసి నాకెంతో గుర్తింపును తీసుకువచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌ల పక్కన నటించే చాన్స్‌ కల్పించారు. ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆయన బతికుండగానే నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్‌ లో దాసరి పేరున ఆడిటోరియాన్ని నిర్మించి ఆయనకు అంకితమిచ్చాను.

పదిమందికి ఉపయోగపడి భారతదేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి దాసరి. నటుడిని శాసించిన వ్యక్తి. కొమ్ములు తిరిగిన నటుడైనా దాసరి వద్దకు వచ్చి మీ సినిమాలో నాకు ఒక చాన్సు ఇవ్వండని అడిగారే తప్ప నా వద్ద కథ ఉంది.. నా సినిమాలో పనిచేస్తారా అని ఏ నటుడినీ అడగని దర్శకుడు. ఇలాంటి మహానుభావుడికి  ప్రభుత్వం 5 గజాల స్థలం కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లి గజం స్థలం అడగలేదు. గతంలో పాలకొల్లులో లలితకళాంజలి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాను.

ఏటా ఒక విద్యార్థికి నా పాఠశాలలో 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్‌ వరకూ ఉచితంగా విద్యనందిస్తానని చెప్పాను. ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, తణుకు వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఎంపీలు గోకరాజు గంగరాజు, ఎం.మురళీమోహన్, సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, రవిరాజా పినిశెట్టి, దవళ సత్యం, రేలంగి నరసింహారావు, దాసరి కుమారుడు తారకప్రభు, సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top