డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యా!

Character artist Ravi Prakash Visit Simhachalam Visakhapatnam - Sakshi

అనుకోకుండా సినీరంగంలోకి ప్రవేశించా..

పుట్టి పెరిగింది విశాఖలోనే..

సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు రవిప్రకాష్‌

సింహాచలం (పెందుర్తి) : సినీ రంగంలోకి అనుకోకుండా వచ్చా.. సాధారణంగా డాక్టర్‌ కావాల్సిన వాడు యాక్టర్‌ అయ్యాడంటారు. నేను మాత్రం డాక్టర్నయ్యాకే యాక్టర్నయ్యానని ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రవిప్రకాష్‌ అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు. విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాలో జరిగిందన్నారు. విశాఖ వేలీ స్కూల్‌లో పన్నెండో తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్‌ మాస్కోలో చేశానని తెలిపారు. కొంతకాలం హైదరాబాద్‌లో ప్రాక్టిస్‌ చేశానన్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు.

అలా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా పరిచయం అయ్యానన్నారు. అప్పటి నుంచి సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రేక్షకులు అందించారన్నారు. ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించానన్నారు. ప్రస్తుతం సమంత, ఆదిపినిశెట్టి జంటగా నటిస్తున్న యూటర్న్‌ సినిమాలోను, తాప్సి, ఆది పినిశెట్టి జంటగా నటిస్తున్న నీవెవరు అనే చిత్రంలోను, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజే హీరోగా నటిస్తున్న అమర్‌ అక్బర్‌ ఆంథోని చిత్రంలోనూ నటిస్తున్నాన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రం తనకు మంచి పేరు తెచ్చిందన్నారు. దర్శనార్థం వచ్చిన రవిప్రకాష్‌ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top