
‘అతడి కోసమే బాహుబలి కథ రాశారు’
బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు.
బెంగళూరు: బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నారు. యంగ్ రెబల్ స్టార్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ రాశారని వెల్లడించారు. ‘బాహుబలి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేదు. ఎందుకంటే ఈ కథను అతడిని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. అందుకే మేము వేరెవరినీ సంప్రదించలేదు. మరొకరిని సంప్రదించినట్టు వార్తల్లో నిజం లేద’ని ఆయన పీటీఐతో చెప్పారు.
బాహుబలి సినిమాను 1975 నాటి బాలీవుడ్ సూపర్‌హిట్ ‘షోలో’తో పోల్చడంపై స్పందిస్తూ... దర్శకుల దార్శనికత, సాహసం కారణంగానే ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయని చెప్పారు. బాహుబలి 3 గురించి ఆలోచించడం లేదన్నారు. యానిమేషన్, టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బాహుబలి సిరీస్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
బాహుబలి మొదటిభాగం కంటే రెండో భాగం బాగుందని తమ యూనిట్ అభిప్రాయపడిందని వెల్లడించారు. బాహుబలి 2లో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఏ పాత్ర బాగా నచ్చిందని అడగ్గా... అమరేంద్ర బాహుబలి కేరెక్టర్ తనను అమితంగా ఆకట్టుకుందని సమాధానమిచ్చారు. రియల్ లైఫ్ స్టోరీలతో సినిమాలు నిర్మిస్తారా అని ప్రశ్నించగా మంచి కథ, తమ బృందాన్ని ఎగ్జైట్ చేసే అంశాలుంటే ముందుకెళతామని చెప్పారు.