‘హౌస్‌ఫుల్‌’పై మీటూ ఎఫెక్ట్‌

Akshay Kumar cancels shoot of Housefull 4 after  - Sakshi

‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి పది రోజులుగా యాక్టర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, సింగర్స్‌లపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి సినీ కెరీర్‌పై ‘మీటూ’ ఉద్యమం ప్రభావం చూపిస్తున్నట్లుంది. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్‌ కపూర్‌తో కలిసి పని చేయలేనని చెప్పేశారు ఆమిర్‌ఖాన్‌. ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ కూడా ఇదే బాటలో నడుస్తానంటున్నారు. ‘హౌస్‌ఫుల్‌ 4’ షూటింగ్‌ను వెంటనే ఆపివేయాలని అక్షయ్‌ ఈ సినిమా నిర్మాత సాజిద్‌ నడియాడ్‌వాలాను కోరినట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘హౌస్‌ఫుల్‌ 4’ డైరెక్టర్‌ సాజిద్‌ ఖాన్, నటుడు నానా పటేకర్‌లపై ‘మీటూ’ ఆరోపణలు రావడమే ఇందుకు కారణమని బాలీవుడ్‌ టాక్‌.

‘‘విదేశాలు నుండి ఇంటికి తిరిగి రాగానే ‘మీటూ’ ఉద్యమానికి చెందిన కథనాలను చదివి కలత చెందాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై విచారణ జరగాలి. బాధితులకు సరైన న్యాయం జరగాలి. మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారితో కలిసి నటించాలని నేను అనుకోవడం లేదు’’ అన్నారు అక్షయ్‌ కుమార్‌. ‘హౌస్‌ఫుల్‌’ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో పార్ట్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’. ఇందులో అక్షయ్‌కుమార్, రితేష్‌ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతీ కర్భందా, కృతీసనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ‘‘మీటూ’ ఉద్యమంలో భిన్న రంగాల మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆవేదనకు గురి చేశాయి.

స్రీలు ఇలా తమ చేదు అనుభవాలను బయటపెట్టడానికి నిజంగా ధైర్యం కావాలి. వారి కథనాలను వినాలి కానీ జడ్జ్‌ చేయకూడదు. బాధిత స్త్రీలందరికీ నా మద్దతు తెలుపుతున్నా. అలాగే ‘హౌస్‌ఫుల్‌ 4’కు సంబంధించి అక్షయ్‌ కుమార్‌ నిర్ణయాన్ని నేనూ కట్టుబడి ఉండాలనుకుంటున్నా అన్నారు ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న రితేష్‌ దేశ్‌ముఖ్‌. అలాగే హౌస్‌ఫుల్‌ 4  సినిమా నుంచి నానా పటేకర్‌ తప్పుకున్నారని బాలీవుడ్‌ టాక్‌. తన వల్ల ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమా టీమ్‌కు ఇబ్బంది కలగకూడదని నానా పటేకర్‌ ఫీల్‌ అయ్యారని హిందీ చిత్రపరిశ్రమలో తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల నానా పటేకర్‌పై  తనుశ్రీ దత్తా ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలకు సాజిద్‌ ఖాన్‌ స్పందించారు.

నైతిక బాధ్యత వహిస్తున్నా
‘మీటూ’ ఉద్యమంలో నాపై వచ్చిన ఆరోపణల కారణంగా నా కుటుంబ సభ్యులు, నా నిర్మాతలు, నా సినిమాల్లోని హీరోల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను. అందుకే ఈ ఆరోపణలకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ, నిజం నిరూపితమయ్యే వరకు డైరెక్టర్‌ చైర్‌ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాను. అలాగే నా స్నేహితులకు, మీడియా వారికి ఒక విన్నపం. నిజం నిరూపించబడే వరకు దయచేసి నాపై వస్తున్న ఆరోపణలను పాపులర్‌ చేయకండి’’ అని ‘హౌస్‌ఫుల్‌ 4’ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ అన్నారు.

ఈ సంగతి ఇలా ఉంచితే... ఆమిర్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్‌ నిర్ణయాల పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘‘అక్షయ్‌ కుమార్‌కు సెల్యూట్‌. మీటూ ఉద్యమంలో భాగంగా అక్షయ్‌ లాగే చాలా మంది స్పందించి మహిళలకు సమానత్వం, గౌరవం అనే అంశాల్లో అండగా నిలుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు మహిళలు ఇండస్ట్రీలో సంతోషంగా పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది’’ అని కన్నడ కథానాయిక పరుల్‌ యాదవ్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

పక్కదారి పట్టకూడదు
తాజాగా ఈ విషయంపై కమల్‌హాసన్‌ స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు పెదవి విప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిజాయతీగా సక్రమమైన మార్గంలో వెళితే మంచి మార్పు వస్తుంది. కానీ ఇది పక్కదారి పట్టకూడదు. తప్పుడు ఆరోపణలు తెరపైకి రాకూడదు. నిజం ఉన్నప్పుడు ‘మీటూ’ ఉద్యమం తప్పుకాదు. సమాజంలో మహిళల సమస్యలను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు పురాణాల కాలం నుంచే మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు’’ అని కమల్‌ పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం వస్తున్న ‘మీటూ’ కథనాలు నన్ను బాధించాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన సంఘటలను షేర్‌ చేసిన మహిళలందరికీ నేను మద్దతు తెలుపుతున్నాను. ఇప్పుడు మహిళలందరూ ఏకతాటిపైకి రావడం మంచి పరిణామంగా భావిస్తున్నాను. మీటూ గొంతు ఇప్పుడు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. మాట్లాడాల్సిన సమయం ఇదే. మంచి మార్పుకు కూడా సరైన సమయం ఇదే.

– రకుల్‌ ప్రీత్‌సింగ్‌

‘మీటూ’ కథనాల వల్ల బాగా డిస్ట్రబ్‌ అయ్యాను. మహిళలకు సొసైటీలో గౌరవం, భద్రత ఉండాలి. అందుకు నేను, నా కంపెనీ కట్టుబడి ఉంటాం. మీటూ ఉద్యమ బాధితులకు నా మద్దతు ఉంటుంది.

– అజయ్‌ దేవగన్‌

బయటకు వస్తున్న పేర్ల కంటే కూడా ఆ సంఘటనలు జరిగిన విధానం నన్ను ఎక్కువగా బాధిస్తున్నాయి. అలాగే ఇన్ని భయంకరమైన సంఘటనలు కూడా మంచు కొండలో కోన మాత్రమే అని అనుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

– తాప్సీ

మా కుటుంబానికి చాలా విషాదకరమైన సమయం ఇది. ఇప్పుడు మేము కొన్ని సమస్యలను ఎదుర్కొనక తప్పదు. నా తమ్ముడు సాజిద్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే ఆ బాధిత మహిళలకు ఒక మహిళగా నా సపోర్ట్‌ ఉంటుంది   

  – ఫరా ఖాన్‌
కథానాయికలు రిచా చద్దా, కృతీ సనన్, ఫరాఖాన్, చిత్రాంగద సింగ్‌లతో పాటు మరికొందరు సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. -

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top