నిద్రమాత్రలు మింగి.. కారు నడిపి

Actor Rajashekar car accident in Hyderabad - Sakshi

ప్రమాదవశాత్తు మరో కారును ఢీకొట్టిన హీరో రాజశేఖర్‌

సాక్షి, హైదరాబాద్‌: సినీ హీరో రాజశేఖర్‌ తన తల్లి చనిపోయిందన్న మానసిక ఒత్తిడిలో నిద్రమాత్రలు మింగి మత్తులోనే కారు నడపడంతో ముందు ఉన్న కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇటు హీరో రాజశేఖర్‌కు కానీ, ప్రమాదానికి గురైన వాహనంలోని వారికి కానీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హీరో రాజశేఖర్‌ తల్లి ఆండాళ్‌ వరదరాజన్‌ (82) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 27న మృతి చెందారు. దీంతో రాజశేఖర్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. సోమవారం రాజశేఖర్‌ ఇంట్లో దశదినకర్మ కార్యక్రమం ఉంది.

అయితే రాజశేఖర్‌ మూడీగా ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు.. ఆదివారం రాత్రి ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నిద్రమాత్రలు మింగిన రాజశేఖర్‌ కారు తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు డయల్‌ 100కు కాల్‌ చేసి ఆయన పరిస్థితిని వివరించి అప్రమత్తం చేశారు. ఇంతలోనే రాజశేఖర్‌ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ 230 వద్ద అత్తాపూర్‌కు చెందిన రామిరెడ్డి కన్‌స్ట్రక్షన్‌ అధినేత రామిరెడ్డి కారును ఢీకొట్టారు. దీంతో కారులో నుంచి రామిరెడ్డి దిగి చూడగా వెనుక కారులో హీరో రాజశేఖర్‌ కనిపించారు. వెంటనే రామిరెడ్డి రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజశేఖర్‌ను రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేశారు. 20 శాతం రీడింగ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న రాజశేఖర్‌ భార్య జీవిత, కుమార్తెలు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. రామిరెడ్డి కూడా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో రాజశేఖర్‌ను ఇంటికి తీసుకెళ్లారు.

అసలేం జరిగిందంటే..
‘‘శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్‌లో బంధువుల రిసెప్షన్‌కు హాజరై పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై కారులో అత్తాపూర్‌కు బయలుదేరాం. అయితే ఆరాంఘర్‌ ఫ్లైఓవర్‌ బెస్ట్‌ ప్రైస్‌ దాటగానే ముందు వెళుతున్న కారు వంకలువంకలు తిరుగుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న వ్యక్తికి గుండెపోటు ఏమైనా వచ్చిందేమోనని అనుకున్నాం. కాస్త ముందుకెళ్లి కారు ఆపాం. అసలేం జరిగిందో చూడమని డ్రైవర్‌ని పంపించా. అంతలోనే మళ్లీ కారును స్టార్ట్‌ చేసి మా వైపుగా వచ్చి మా కారును బలంగా ఢీకొట్టింది. దీంతో మా కారు బాగా ధ్వంసమైంది. కారు దిగి చూడగా హీరో రాజశేఖర్‌ కనిపించారు. అతని ప్రవర్తనలో కాస్త తేడా కనిపించడంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించాం. అప్పటికే దాదాపు 300 మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అనంతరం రాజశేఖర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేశారు. 20 శాతం రీడింగ్‌ మాత్రమే వచ్చింది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన రాజశేఖర్‌ భార్య జీవిత.. వాళ్ల అమ్మ చనిపోయినప్పటి నుంచి మనిషి మనిషిగా లేడని చెప్పడంతో మానవతా దృక్పథంతో ఫిర్యాదు చేయలేదు’’అని రామిరెడ్డి కన్‌స్ట్రక్షన్‌ అధినేత రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం.. వీడియో వీక్షించండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top