breaking news
hero rajasekhar
-
నిద్రమాత్రలు మింగి.. కారు నడిపి
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో రాజశేఖర్ తన తల్లి చనిపోయిందన్న మానసిక ఒత్తిడిలో నిద్రమాత్రలు మింగి మత్తులోనే కారు నడపడంతో ముందు ఉన్న కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇటు హీరో రాజశేఖర్‌కు కానీ, ప్రమాదానికి గురైన వాహనంలోని వారికి కానీ ఎటువంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హీరో రాజశేఖర్ తల్లి ఆండాళ్ వరదరాజన్ (82) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 27న మృతి చెందారు. దీంతో రాజశేఖర్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. సోమవారం రాజశేఖర్ ఇంట్లో దశదినకర్మ కార్యక్రమం ఉంది. అయితే రాజశేఖర్ మూడీగా ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు.. ఆదివారం రాత్రి ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నిద్రమాత్రలు మింగిన రాజశేఖర్ కారు తీసుకుని రోడ్డుపైకి వచ్చారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు డయల్ 100కు కాల్ చేసి ఆయన పరిస్థితిని వివరించి అప్రమత్తం చేశారు. ఇంతలోనే రాజశేఖర్ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ 230 వద్ద అత్తాపూర్‌కు చెందిన రామిరెడ్డి కన్స్ట్రక్షన్ అధినేత రామిరెడ్డి కారును ఢీకొట్టారు. దీంతో కారులో నుంచి రామిరెడ్డి దిగి చూడగా వెనుక కారులో హీరో రాజశేఖర్ కనిపించారు. వెంటనే రామిరెడ్డి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజశేఖర్‌ను రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. 20 శాతం రీడింగ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న రాజశేఖర్ భార్య జీవిత, కుమార్తెలు రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. రామిరెడ్డి కూడా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో రాజశేఖర్‌ను ఇంటికి తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే.. ‘‘శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్లో బంధువుల రిసెప్షన్‌కు హాజరై పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారులో అత్తాపూర్‌కు బయలుదేరాం. అయితే ఆరాంఘర్ ఫ్లైఓవర్ బెస్ట్ ప్రైస్ దాటగానే ముందు వెళుతున్న కారు వంకలువంకలు తిరుగుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న వ్యక్తికి గుండెపోటు ఏమైనా వచ్చిందేమోనని అనుకున్నాం. కాస్త ముందుకెళ్లి కారు ఆపాం. అసలేం జరిగిందో చూడమని డ్రైవర్ని పంపించా. అంతలోనే మళ్లీ కారును స్టార్ట్ చేసి మా వైపుగా వచ్చి మా కారును బలంగా ఢీకొట్టింది. దీంతో మా కారు బాగా ధ్వంసమైంది. కారు దిగి చూడగా హీరో రాజశేఖర్ కనిపించారు. అతని ప్రవర్తనలో కాస్త తేడా కనిపించడంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాం. అప్పటికే దాదాపు 300 మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం రాజశేఖర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. 20 శాతం రీడింగ్ మాత్రమే వచ్చింది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన రాజశేఖర్ భార్య జీవిత.. వాళ్ల అమ్మ చనిపోయినప్పటి నుంచి మనిషి మనిషిగా లేడని చెప్పడంతో మానవతా దృక్పథంతో ఫిర్యాదు చేయలేదు’’అని రామిరెడ్డి కన్స్ట్రక్షన్ అధినేత రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నటుడు రాజశేఖర్ కారుకు ప్రమాదం.. వీడియో వీక్షించండి -
జీవితతో మాట్లాడటానికి ఇష్టపడేవాడ్ని కాదు..
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమనీ.. 'అల్లరి ప్రియుడు' చిత్రంలో అలరించే ఈపాటను మర్చిపోగల వారెవరు? ప్రేమలో మాధుర్యాన్ని సుమనోహరంగా వర్ణించిన ఈ గీతాన్ని జ్ఞాపకాల నుంచి చెరిపేయగల వారెవరు? నిజం.. ప్రేమ అంత మధురభావం. అది అనుభవమైన వారి జీవితం ధన్యం. అల్లరిప్రియుడిగా ఈపాటలో అభినయించిన రాజశేఖర్ కు అది అనుభవమైంది. వేరే సినిమాలో కలిసి నటించిన జీవిత జీవన భాగస్వామిగా మారింది. ఇప్పుడా జంట తోడునీడగా బతుకునావలో పయనం సాగిస్తోంది. విశాఖకు వచ్చిన సందర్భంగా ఆ జంట తమ వలపు ముచ్చట్లను ఇలా 'సిటీప్లస్' తో పంచుకుంది. రాజశేఖర్: తలంబ్రాలు చిత్రంలో జీవిత, నేను కలిసి తొలిసారిగా నటించాం. అందులో నాది నెగెటివ్ రోల్. అయితే వ్యక్తిగతంగా నా తీరు అందుకు పూర్తిగా భిన్నం. పెద్దగా అమ్మాయిలతో మాటాడేవాడిని కాను. అప్పటికే మెడిసిన్ కంప్లీట్ చేసి సినిమాలంటే ఇష్టం కొద్దీ తెరపైకి వచ్చాను. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పేశాను కూడా. యాక్టింగ్ తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. అయితే మొదట్లో మా ఇద్దరి మధ్య సంభాషణ కొద్దిగా ఇగోతోనే మొదలైంది. ఆమె నాకంటే బాగా నటించేది. దాంతో బేసిగ్గానే కాస్త అసూయ ఉండేది. ఆమెతో మాట్లాడటానికి ఆసక్తి చూపేవాడిని కాదు. కానీ క్రమంగా స్నేహం పెరిగింది. ప్రేమ కలిగింది. కానీ అప్పుడు కూడా మా మధ్య ప్రేమ ఉన్నదనే విషయం మాకు తెలియదు. ఆ విషయం తనే నాకు చెప్పింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. జీవిత: అతన్ని నాకు తెలియకుండానే ఇష్టపడేదాన్ని. అతను వేరొకరిని పెళ్లి చేసుకుంటే మాత్రమేం.. నేను ప్రేమించకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించేటంత ఇష్టం ఉండేది. మామూలుగా ఉండే నేను కావాలనుకున్న దాని గురించి ఎంత వరకైనా వెళ్తానని అలా అర్ధమైంది. నా ఇష్టం అతనికి నచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం పెళ్లితో ముడిపడింది. తనే నా బలం.. రాజశేఖర్: (నవ్వుతూ).. ఆమె నన్ను ప్రేమించింది. నేను దొరికిపోయాను.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆ శక్తి ఎంత గొప్పదనిపిస్తుంది. తను నేనంటే ప్రాణం పెడుతుంది. నాకోసం ఎంతో చేస్తుంది. సర్దుకుపోతుంది. నాకు కోపం ఎక్కువ. మగాళ్లో కనిపించే ఇగో నాలో కూడా ఉంది. కొన్ని సార్లు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లాక కూడా సీరియస్‌గా ఉంటా. ఆ క్షణం ఆమె చాలా కామ్‌గా ఉంటుంది. కోపంతో ఏమైనా అన్నా తనే సారీ చెబుతుంది. హీరోగా బిజీ అయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జీవిత తీసుకుంది. నన్ను ఓ పిల్లాడిలా చూసుకుంది. నా అవసరాలన్నీ తీరుస్తుంది. ఇలాటి ఇల్లాలు ఉంటే ఇక కావాల్సిందేముంది? అందుకే నా బలం అంతా జీవితనే.. జీవిత: భార్యగా బాధ్యతలు చూసుకోవడంలో తప్పేముంది? భర్త, పిల్లల మంచి చెడ్డలు చూసుకోవడం సంతోషకరమే కదా. ఒత్తిడితో ఇంటికి వచ్చే భర్తకు భార్య వల్ల ఉపశమనం కలగాలి. ప్రేమ ఉంటే ఇగో ఉండకూడదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఇద్దరూ ఒకటే అయితే ఎవరు సారీ చెబితే ఏముంది? ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్లలేక. మా కోసం ఈయన చాలా అవకాశాలు వదిలేసుకున్నారు. నా కోసం, పిల్లల కోసం అంత చేసినపుడు నేను కొంతైనా చేయాలి కదా.. ప్రేమ ఉన్న చోట కోపం కూడా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకుంటే సమస్య ఉండదు. ప్రేమలో నిజాయితీ ముఖ్యం రాజశేఖర్: ఈ జనరేషన్ పిల్లలకు మేము చెప్పాల్సింది ఒకటే. మీ ప్రేమలో నిజాయితీ ఉందోలేదో చూసుకోండి. మగవారిమనే ఇగో పక్కన పెట్టి.. అభిప్రాయభేదాలు ఉంటే వెంటనే వెళ్లి సారీ చెప్పేయండి. ఆడవాళ్లకు క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి కనిపించింది...అందంగా ఉంది. ఇష్టపడ్డాం అనుకుంటే ఆ ప్రేమ ఎంత వరకు నిలబడుతుందో నమ్మకం ఎక్కడిది? జీవిత: ఇప్పటి జనరేషన్లో పిల్లలకు వయస్సుకు మించిన ఆలోచనలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కల్పించిన సౌకర్యాలను, అందించిన అవకాశాలను కొందరు సరిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అనవసరపు వ్యామోహాలు, ఆలోచనలకు పోయి తెలియని ఆకర్షణకు లోనవుతున్నారు. దానిని ప్రేమ అనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఆలోచించాలంటున్నా. ప్రేమో కాదో తేల్చుకున్నాకే నిర్ణయం తీసుకోమంటున్నా. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకు చెబుతున్న మాట.