బిగ్‌ బి @ 49

49 years of Amitabh Bachchan in Bollywood - Sakshi

సరిగ్గా నలబైతొమ్మిదేళ్ల క్రితం ఓ నూనూగు మీసాల యువకుడు ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో వెండితెర తలుపు తట్టాడు. ఎన్నో అవమానాలు, తిరస్కారాల తరువాత తన తొలి సినిమాకు సంతకం చేశాడు. ఆ రోజున ఎవరూ ఊహించలేదు.. ఆ కుర్రాడే ఇండియన్‌ సినిమాకు పర్యాయపదంగా మారతాడని, ఆ కుర్రాడే కమర్షియల్ సినిమాను కొత్తపుంతలు తొక్కిస్తాడని.. ఏకంగా ఐదు దశాబ్దాల పాటు బాలీవుడ్ షెహన్‌షాగా వెండితెరను ఏలతాడని.

సరిగ్గా 49 ఏళ్ల క్రితం 1969 ఫిబ్రవరి 15న బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ తన తొలి సినిమా ‘సాత్‌ హిందుస్థాని’ కోసం అగ్రిమెంట్‌ సంతకం చేశారు. ఆ రోజునే ఆయన అధికారికంగా భారతీయ సినీరంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఏడుగురు హీరోల్లో ఒకరిగా నటించారు బిగ్‌ బి. అందుకే తొలి సినిమాతో అమితాబ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తరువాత తరువాత ఆయనే సక్సెస్‌కు చిరునామాగా మారారు. వెండితెరను శాసించారు. ఇప్పటికీ బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా కొనసాగుతున్నారు.

తను తొలి సినిమా అంగీకరించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమితాబ్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. తొలి సినిమాలోని స్టిల్స్‌ ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన బిగ్‌ బి ‘49 ఏళ్ల క్రితం నేను ఈ కలల నగరానికి వచ్చి తొలి సినిమాకు సంతకం చేశాను’ అంటూ కామెంట్‌ చేశారు. అమితాబ్‌ ప్రస్తుతం 102 నాట్‌ అవుట్ సినిమాతో పాటు ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ సినిమాలో నటిస్తున్నారు.

Back to Top