120 రోజుల్లో 108 చిత్రాలు | 108 pictures in 120 days | Sakshi
Sakshi News home page

120 రోజుల్లో 108 చిత్రాలు

May 4 2014 11:55 PM | Updated on Sep 2 2017 6:55 AM

120 రోజుల్లో 108 చిత్రాలు

120 రోజుల్లో 108 చిత్రాలు

తమిళ చిత్రసీమలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయి. వారానికి కనీసం ఐదు చిత్రాల నుంచి 10 చిత్రాల వరకు విడుదలవుతున్నాయి.

 తమిళ చిత్రసీమలో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అధిక సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయి. వారానికి కనీసం ఐదు చిత్రాల నుంచి 10 చిత్రాల వరకు విడుదలవుతున్నాయి. ఏప్రిల్ చివరి వరకు మొదటి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు 108 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో స్ట్రైయిట్ తమిళ చిత్రాలు సుమారు 80 ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో ‘గోలీ సోడా’ మాత్రమే అత్యధిక వసూళ్లతో విజయవంతమైంది. ప్రముఖ నటులు నటించిన కొన్ని చిత్రాలు వసూళ్లు సాధించినా వాటి బడ్జెట్‌ను పోల్చి చూసినట్లయితే నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యజమానులకు లాభం చేకూరలేదు. సాధారణంగా వేసవిలో సినిమాలకు అధిక వసూళ్లు వుంటాయి.
 
 అయితే ఈ ఏడాది ఏ చిత్రం వసూళ్లు సాధించలేక పోయింది. వేసవిలోనూ థియేటర్లు బోసిపోయాయి. ఈ సీజన్‌లో ప్రజలు థియేటర్లకు వెళ్లడం కంటే పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్రాల విడుదలకు నిర్మాతల సంఘం కొన్ని నిబంధనలు విధించినప్పటికీ వాటిని ఎవరూ అనుసరించడం లేదు. దీని గురించి నిర్మాతల సంఘం అధ్యక్షుడు కేఆర్ మాట్లాడుతూ సినిమా ప్రమాదకరమైన మార్గంలో పయనిస్తోందని అన్నారు. సాధారణంగా ఏ రంగంలోనైనా సమస్యలు ఎదురైనప్పుడు భిన్నాభిప్రాయాలకు స్వస్తి చెప్పి ఐక్యతతో వ్యవహరిస్తారని, అయితే సినీరంగంలో ఇటువంటి సమస్యలు ఏర్పడినపుడు అభిప్రాయభేదాలు, చీలికలు ఏర్పడతాయన్నారు.
 
 చిత్రం విడుదల సమయంలో తాము రూపొందించిన నిబంధనలు ఆచరణలో లేకపోవడం వాస్తవమేనన్నారు. డిజిటల్ టెక్నాలజీ కారణంగా కొత్తవారు అనేక మంది సినీ రంగంలో ప్రవేశిస్తుండడంతో అనేక చిత్రాలు వస్తున్నాయన్నారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలను బట్టి చిత్రాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  ఏ చిత్రాన్ని చూడకూడదో ప్రజలు క్షుణ్ణంగా నిర్ణయిస్తున్నారన్నారు. ప్రతి రోజూ ఒక చిత్రం విడుదలవుతోందని, భవిష్యత్తులో ఉదయం ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా రిలీజయినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. వేసవిలో థియేటర్లలో పండుగ వాతావరణం కనిపిస్తుందని. అయితే ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపారు. ఇది సినిమాకు నిజంగా గడ్డుకాలమని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement