333 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్‌

Sensex gains 500 points, Nifty nears 9,000 - Sakshi

100 పాయింట్లపై నిఫ్టీ ప్రారంభం

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 333 పాయింట్లు పెరిగి 30363 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు లాభంతో 8925 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 

అమెరికా ఫార్మా కంపెనీ మెడెర్నా ఇంక్‌ తయారీ చేసిన కోవిద్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్‌లో మంచి ఫలితాలను కనబర్చినట్లు ప్రకటించింది. వాక్సిన్స్‌పై ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్‌ 3.85శాతం, నాస్‌డాక్‌ 2.50శాతం, ఎస్‌అండ్‌పీ 3శాతం లాభంతో ముగిశాయి. దీంతో ఆసియాలో ప్రధాన మార్కెట్లన్నీ లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌, చైనా, హాంగ్‌కాంగ్‌తో దేశాలకు చెందిన షేర్లు 2శాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి.   

దేశీయ పరిణామాల విషయానికొస్తే... కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ పొడగింపు(మే 31వరకు) సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. నేడు మొత్తం కేసుల సంఖ్య లక్షను దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సుమారు 3156 మంది మృత్యువాత పడ్డారు. నేడు బజాజ్‌ ఫైనాన్స్‌, అపోలో టైర్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌తో పాటు సుమారు 18 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తాయి. ఇవన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అంశాలు.

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 331 పాయింట్ల లాభంతో 30360 వద్ద నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 8914.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో  ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూసిన ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు నేడు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.60శాతం లాభపడి 17,854.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, సిప్లా, టీసీఎస్‌, విప్రో షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. టాటామోటర్స్‌, జీ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top