స్వచ్ఛంద సేవకులు

NSS students voluntary service in gopaldinne village - Sakshi

గోపల్‌దిన్నెలో విద్యార్థుల శ్రమదానం

కంపచెట్లు, పిచ్చిమొక్కుల తొలగింపు

పలువురి ప్రశంసలు పొందుతున్నఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

వీపనగండ్ల :  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలతో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసం తక్కువ. కానీ విద్యార్థులు ఐక్యమత్యంతో గ్రామాలు శుభ్రంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. 

స్వచ్ఛంద శ్రామికులు 
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా ఐదు రోజులపాటు గోపల్‌దిన్నెలో శ్రమదానం చేస్తున్నారు. గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలోని వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అంతేకాక మరుగుదొడ్ల నిర్మాణంతో కలిగే ఉపయోగాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సేవా దృక్పథం చూసిన మంత్రి జూపల్లి కృష్ణారావు  విద్యార్థులు పలువురిలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. 

భాగస్వాములను చేయాలి 
గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమాజ సేవలో  భాగస్వాములను  చేశాం.  గ్రామాల ప్రజలు కూడా సమాజం కోసం పని చేయాలన్న దృక్పథాన్నినింపాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  విద్యార్థుల చేత ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నాం.      

– లక్ష్మినారాయణ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ 

ఆనందంగా ఉంది 
విద్యార్థులు మా గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థుల స్ఫూర్తి తో రానున్నరోజుల్లో అభివృద్ధి పనులు చేపడతాం.     

లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ
 

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top