ఆమె బార్‌ గాళ్‌గా పనిచేయటం చూడలేక.. | Texas Bar Bouncer Philip Susan Love Story | Sakshi
Sakshi News home page

‘మీరు బార్‌లో పాటలు పాడడం నాకిష్టం లేదు’

Oct 26 2019 4:03 PM | Updated on Oct 30 2019 4:38 PM

Texas Bar Bouncer Philip Susan Love Story - Sakshi

పొట్టి పొట్టి బట్టలు కట్టుకుని, పాటలు పాడుతూ, మందు బాబులను అలరించే అమ్మాయిగా....

‘అబ్బా... ఈ రోజు కూడా వెళ్లాలా!’ అంది నోరు. ‘వెళ్లక చస్తావా? వెళ్లకుంటే ఆకలితో మాడి చస్తావ్’ అంది అంతరాత్మ. దాంతో తప్పనిసరై బయలుదేరాడు ఫిలిప్. ‘ఫోర్ట్ వర్త్ బార్’లోకి అయిష్టంగానే అడుగుపెట్టాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఫిలిప్. ఆర్థిక పరిస్థితుల వల్ల అతడి కోరిక కోరికగానే మిగిలిపోయింది. ‘చదువుకోలేక పోయానే’ అన్న అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. ఈ  బాధను దారి మళ్లించడానికి చాన్స్‌ దొరికితే వ్యాయామంలో మునిగిపోయేవాడు. చివరికి అదే బార్‌లో  బౌన్సర్‌గా బతుకుదారి చూపింది. అయితే బార్‌లో  వాతావరణం ఫిలిప్‌కు బొత్తిగా నచ్చేది కాదు. కేకలు, అరుపులు, గొడవలు, సిగరెట్ పొగలు... ఆ ప్రపంచమంటేనే వెగటు వచ్చేది. అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. రాజీ పడుతూ బతుకు బండిని భారంగా లాగించసాగాడు. సరిగ్గా అప్పుడే సూజన్ అతని జీవితంలో ప్రవేశించింది.

ఫిలిప్ పని చేస్తోన్న బార్‌లో బార్ గాళ్‌గా చేరింది సూజన్. మొదటి చూపు లోనే ఫిలిప్ మనసును తడిమింది. ఆమె అమాయకమైన ముఖం ఫిలిప్ మనసులో ముద్రపడి పోయింది. అందుకే పొట్టి పొట్టి బట్టలు కట్టుకుని, పాటలు పాడుతూ, మందు బాబులను అలరించే అమ్మాయిగా తనను చూడలేకపోయాడు. ‘ఇంత చక్కని అమ్మాయి ఇక్కడ ఇలా ఉండటమేంటి’ అనిపించేది. కానీ తనతో మాట్లాడాలంటే మనసు సిగ్గుతో మెలికలు తిరిగేది. చివరికి ఓరోజు ధైర్యం చేసి మాట కలిపాడు. ‘‘మీరు బార్‌లో పాడడం నాకు ఇష్టం లేదు. చిన్న వయసు. చక్కగా చదువుకోవచ్చుగా’’ అన్నాడు ఫిలిప్. ఆశ్చర్య పోయిందామె. ఇతనేంటి ఇలా చెబుతున్నాడు అనుకుంది. కానీ అతని మనసులో తనమీద అప్పటికే పెరిగిన అపారమైన ప్రేమ అలా మాట్లాడిస్తోందని అర్థం చేసుకుంది.

చదువుకోలేని తన అశక్తతని, నిస్సహాయతని వివరించింది. ‘నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నీ కష్టాన్ని పంచుకోలేనా, నిన్ను నేను చదివిస్తాను’ అన్నాడు ఫిలిప్. తల అడ్డంగా ఊపింది సూజన్. ‘నీకూ చదువంటే ఇష్టమే అన్నావ్ కదా. నాతో పాటు నువ్వూ చదువుకోవాలి. అలా అయితేనే ఒప్పుకుంటాను’ అంది. ‘సరే’ అన్నాడు. నాటి నుంచీ వాళ్ల మనసులతో పాటు లక్ష్యాలూ ఒక్కటయ్యాయి. ఒకరికొకరు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. పుస్తకాలు చేతబట్టారు. ప్రేమ అనేది అప్పుడే పుట్టిన వెలుగు కిరణం లాంటిది. చీకట్లో అప్పటి వరకు  చూడలేనివాటిని అది చూపుతుంది. ప్రేమ వెలుగులో ఫిలిప్, సూజన్‌లు  చదువులోని అద్భుతాన్ని, ఆకర్షణను చూశారు. ఒక్కొక్క మెట్టూ ఎదిగారు.

ఒక్కొక్క క్లాసూ దాటారు. టెక్సాస్‌లోని సర్ రాస్ స్టేట్ యూనివర్శిటీ నుంచి బయాలజీలో బేచిలర్ డిగ్రీ, ఆ తరువాత మాస్టర్ డిగ్రీ కూడా తీసుకున్నారు. పట్టా చేతికి వచ్చాక ప్రపంచాన్ని జయించినంత గర్వంగా అనిపించింది ఫిలిప్‌కి. ‘‘నువ్వు నా జీవితంలో రాక పోయి ఉంటే చీకట్లో మగ్గిపోయేవాడిని’’ అన్నాడు సూజన్ చేతిని ప్రేమగా చేతిలోకి తీసుకుని. ‘‘నాదీ అదే మాట’’ అంది సూజన్. తర్వాత ఇద్దరూ దంపతులు అయ్యారు. జీవితాన్ని సంతోషంగా సాగించారు. కొన్నాళ్ల క్రితమే కోడీ సిటీలోని ‘డ్రాపర్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’లో బయాలజిస్ట్‌గా సూజన్, అసిస్టెంట్‌ క్యురేటర్‌గా ఫిలిప్ రిటైరయ్యారు. ప్రస్తుతం తమ ప్రేమ పుస్తకంలోని పేజీల్ని తిరగేసి చూసుకుంటూ గడుపుతున్నారు. ఆ పుస్తకం నిండా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. తమ జీవితాన్ని కాంతివంతం చేసిన వెలుగు రేఖలున్నాయి!   
- యాకుబ్ పాషా


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement