చిన్న విషయాలే జీవితాల్ని నాశనం చేస్తాయి.

Small Things In A Relationship That Are Actually Matters Most - Sakshi

కొన్ని సందర్బాల్లో చిన్న చిన్న విషయాలే మనల్ని తీవ్రంగా బాధిస్తాయి. ముఖ్యంగా ఓ రిలేషన్‌లో ఉన్నపుడు. మనకు సమస్యగా కనిపించని చిన్న విషయాలు ఎదుటి వ్యక్తిని మానసికంగా ఇబ్బందులకు గురి చేయవచ్చు. అప్పుడే ప్రేమ బంధంలోకి అడుగుపెట్టిన వారైనా.. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వీటి వల్ల బాధింపబడక తప్పదు. చిన్న విషయాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవే జంట మధ్య నిత్యం గొడవలకు దారితీయవచ్చు లేదా ఇద్దరి జీవితాలను నాశనం చేసే అవకాశం ఉంది. 

1) చిన్న చిన్న పనులు 
రిలేషన్‌లో ఉన్నపుడు ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇవ్వటం తప్పని సరి. మీకంతగా పట్టింపులులేని వాటిపై ఎదుటి వ్యక్తికే నిర్ణయాధికారాన్ని వదిలేయటం మంచిది. హోటల్‌లో ఆర్డర్‌ చేసే ఐటమ్‌ కావచ్చు, కలిసి చూసే టీవీ షోలు కావచ్చు. వారి ఇష్టాలకు స్వేచ్ఛ నివ్వండి. ఇది మనం ఎదుటి వ్యక్తికి ఎంత ప్రాధాన్యత నిస్తున్నామో తెలియజేస్తుంది. 

 2) కాంప్లిమెంట్స్‌, విషింగ్స్‌
మనం ఎదుటివ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నామో చేతల్లోనే కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాటల్లో చెప్పటం కూడా అవసరం. ఉదయం లేవగానే ప్రేమగా పలకరించటం, ఆమె, అతడు మన కోసం ఏదైనా చేసినపుడు కాంప్లిమెంట్‌ ఇవ్వటం కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

3) శ్రద్ధ
జంట అన్న తర్వాత ఒకరి విషయాలను ఒకరికి చెప్పుకోవటం, సమస్యలు ఎదురైనపుడు దానికి పరిష్కారాన్ని కోరటం పరిపాటి. అలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాలి. సమస్య మీరు పరిష్కరించేది కాకపోయినా సానుభూతి తెలియజేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తి మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసే పనులు చేయకూడదు.

4) సహనం
ఏ బంధమైనా అది కలకాలం నిలబడాలంటే జంటలోని వ్యక్తులకు సహసం చాలా అవసరం. ఇది వ్యక్తుల మధ్య ఉన్న వేరు వేరు ఆలోచనలను, వ్యక్తిత్వాలను మనకు తెలియజేస్తుంది. వారిని అర్థం చేసుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. జంట మధ్య సంభాషణలు గొడవలతో కాకుండా చర్చలతో ముగియాలంటే సహనం అవసరం.

5) నమ్మకం
మనతో ఉంటే సంతోషంగా ఉండగలమనే నమ్మకాన్ని ఎదుటి వ్యక్తికి కల్పించాలి. అది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా. ఆపదలనుంచి పార్ట్‌నర్‌ను రక్షిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి భావాలకు గౌరవాన్నివ్వాలి. అంతే కాకుండా నిజాయితీ, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే గుణం బంధం సాఫీగా సాగిపోవటానికి ఎంతో అవసరం. 


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top