ముగ్గురికీ ఇవ్వాల్సిందే! 

Minister Akilapriya Demand For Three Mla Seats - Sakshi

కర్నూలు సీటుపై పీటముడి నేపథ్యంలో అల్టిమేటం      

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో సీట్ల కేటాయింపు వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఒకవైపు కోట్ల కుటుంబం రాకతో అటు ఆలూరు, ఇటు డోన్‌లో ఎమ్మెల్యే సీటు విషయంలో చర్చ మొదలుకాగా..ఇప్పుడు కర్నూలు సీటు విషయంలో మరింత రచ్చ జరుగుతోంది. కర్నూలు టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబడుతున్నారు. లేనిపక్షంలో తాము ముగ్గురమూ బరిలో ఉండబోమని టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.

ముగ్గురిలో ఏ ఒక్కరికి సీటు ఇవ్వకపోయినా తామంతా పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే  ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ సీట్లకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూలు, నంద్యాల, డోన్‌లో కూడా మొదట్లో సిట్టింగులకే ఇస్తామని చెప్పారు. అయితే, టీజీ వెంకటేష్‌ చక్రం తిప్పడంతో కర్నూలు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా టీజీ వెంకటేష్‌ కుమారుడు భరత్‌..మంత్రి లోకేష్‌తో భేటీ తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఎస్వీ, భూమా కుటుంబాలు సిద్ధమైనట్టు సమాచారం. ఎస్వీ, భూమా కుటుంబాలు వేర్వేరన్న విషయాన్ని గ్రహించాలని, ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఇవ్వడం లేదని, రెండు కుటుంబాలకు కలిపి మూడు సీట్లు అన్న విషయాన్ని గుర్తించాలని అధిష్టానానికి వివరించినట్టు తెలుస్తోంది. ఇక కోట్ల కుటుంబం చేరికతో డోన్‌ విషయంలోనూ చర్చ మొదలయ్యింది. 

లోకేష్‌ను కలవడంతో.. 
వాస్తవానికి చంద్రబాబు సమక్షంలో జరిగిన జిల్లా సమీక్ష సందర్భంగా కర్నూలు సీటు ఎస్వీకే అని ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. నంద్యాల సీటు కూడా భూమా బ్రహ్మానందరెడ్డికే ఇస్తామని  స్పష్టం చేశారు. అయితే, టీజీ భరత్‌ మంత్రి లోకేష్‌ను కలిసిన తర్వాత చర్చ మరో విధంగా సాగుతోంది. విజన్‌యాత్రను మరింత దూకుడుగా చేసుకోవాలని, సర్వే ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని భరత్‌తో లోకేష్‌ అన్నట్టు తెలుస్తోంది. దీంతో భరత్‌ మరింత దూకుడు పెంచారు.

టీజీ కుటుంబానికి సీటివ్వకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా మొదలయ్యింది. అయితే, ఎస్వీకి సీటు ఇవ్వకపోయినప్పటికీ ఎటూ పోయే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దీంతో భరత్‌ వైపు చంద్రబాబు మొగ్గు చూపారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురికీ సీట్లు ఇవ్వాల్సిందేనని, లేకపోతే బరి నుంచి తప్పుకుంటామంటూ అల్టిమేటం జారీచేసినట్టు తెలుస్తోంది.
     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top