ప్రతి పనికీ పైసలివ్వాల్సిందే

bribery demand for every work in municipal office - Sakshi

ఆదోని మునిసిపల్‌ రెవెన్యూ విభాగంలో మితిమీరిన అవినీతి

దళారుల అవతారమెత్తిన కొందరు కౌన్సిలర్లు

మండిపడుతున్న పట్టణవాసులు

ఆదోని టౌన్‌:   ఆదోని మునిసిపల్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. కొందరు అధికారులు ప్రతి పనికీ చేయి చాస్తున్నారు. పైసలివ్వందే పని చేయడం లేదు. కీలకమైన రెవెన్యూ విభాగంలో అవినీతి మితిమీరింది.  స్థిర,చరాస్తులకు సంబంధించి పేర్లు మార్చాలన్నా, తండ్రి ఆస్తిని కొడుకు పేర రాయాలన్నా, చివరకు కుళాయి కనెక్షన్‌ కావాలన్నా చేతులు తడపాల్సి వస్తోంది. మునిసిపాలిటీలో 33వేల నివాస గృహాలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే వారి ఆస్తిని వారసుల పేరుపై మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేస్తే దాన్ని తమపేర రికార్డుల్లో నమోదు చేయించుకోవాలి.

పన్ను చెల్లింపులు కూడా బదలాయించుకోవాలి. ఇలా పేర్ల మార్పు, ఆస్తి పన్ను త్వరితగతిన విధించాలంటే రెవెన్యూ విభాగం సిబ్బంది చేయి తడపాల్సి వస్తోంది. పేర్ల మార్పు, పన్ను బదలాయింపు తదితర వాటి కోసం 300 మంది దాకా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రెవెన్యూ విభాగంలో సకాలంలో పని కావడం లేదు. ఈ దరఖాస్తులను అధికారులు త్వరితగతిన పరిష్కరించినట్లయితే మునిసిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న కొందరు అధికారుల తీరు వల్ల మునిసిపాలిటీ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా చెడ్డపేరు కూడా మూటగట్టుకుంటోంది. పని కావాలంటే కిందిస్థాయి ఉద్యోగులతో ముందుగా ‘ఒప్పందం’ కుదుర్చుకుని రావాలని కొందరు బిల్‌ కలెక్టర్లు సూచిస్తున్నారు. మరికొందరు దళారుల పేర్లు చెబుతూ.. వారితో ‘ఓకే’ చెప్పిస్తేనే పని త్వరగా అవుతుందని అంటున్నారు.  

దళారుల అవతారమెత్తిన కౌన్సిలర్లు
ఆదోని మునిసిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు దళారుల అవతారమెత్తారు. సొంత వార్డులో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మునిసిపల్‌ కార్యాలయంలోనే తిష్టవేస్తున్నారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కార్యాలయానికి వచ్చే వారికి పనులను చేసిపెడతామంటూ రూ.వేలల్లో గుంజుతున్నారు.  

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top