
సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది.
విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టాండ్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. నగరంలోని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు తరలివచ్చారు. దీంతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా కనిపించింది. బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు షెడ్యూల్ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులు నడిపారు.
పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు
కడప సెక్టార్ వైపు యాచోటు, అనంతపురం, పులివెందుల, కర్నూలు తదితర ప్రాంతాలకు 85 అదనపు సర్వీసులు, రాజమండ్రి, కాకినాడ, భద్రాచలం తదితర రూట్‌లలో 50 మెట్రో, సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ప్రత్యేకంగా నడిచాయి. పలు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం 30 సిటీ సర్వీసులను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్‌కు 80 ప్రత్యేక బస్సులు నడిపారు.
– బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు)