
విజయవాడ కల్చరల్: విజయవాడకు చెందిన మల్లాది రాహత్ అద్భుత ప్రతిభ చాటాడు. 105 ప్రపంచ భాషల్లో 105 పాటలను 7 గంటల 20 నిమిషాల పాటు నిర్విరామంగా ఆలపించాడు. అందులో భారతీయ భాషలు 36 ఉండటం విశేషం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అధికారిక నమోదు కోసం గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కూచిపూడి నాట్యరామం చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గిన్నిస్ నియమాల ప్రకారం 4 గంటల అనంతరం 5 నిమిషాలు విరామం తీసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి, గజల్ శ్రీనివాస్ పేరుతో ఉన్న రికార్డును రాహత్ బద్దలు కొట్టాడు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త ఎం.సి.దాస్, భారతీయ విద్యాభవన్ ప్రతినిధి పార్థసారథి సాక్షులుగా వ్యవహరించారు. గీతాలపన కార్యక్రమాన్ని ప్రత్యేక యూనికోడ్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు అందించారు. రాహత్ తండ్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ రెండు వారాల అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి నమోదు పత్రం అందుతుందని తెలిపారు.
గతంలో గజల్ శ్రీనివాస్ 75 భాషల్లో పాటలు పాడి రికార్డు నెలకొల్పారని, రాహత్ 105 భాషల్లో గీతాలు ఆలపించి దాన్ని అధిగమించారని చెప్పారు. కార్యక్రమంలో కొచ్చర్లకోట చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు కొచ్చర్లకోట లక్ష్మీపద్మజ, సినీ సంగీత దర్శకుడు వీణాపాణి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.