కేంద్రం సహకారంతోనే 24 గంటల విద్యుత్‌

24 hours power supply in telangana Center co-operation - Sakshi

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ధర్మపురి అరవింద్‌ చేపట్టిన పాదయాత్రను రెండోరోజు మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. రైతులకు,  పరిశ్రమలకు, వాణిజ్యా సంస్థల కోసం 765 కేవీ విద్యుత్‌ లైన్‌ను జార్ఖండ్‌ నుంచి డిచ్‌పల్లి వరకు తేవడం జరిగిందని తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్రం రాయితీలు ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4కు యూనిట్‌ కరెంట్‌ ఒప్పందం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 చొప్పున ఆగ్రిమెంట్‌ చేసుకున్నారని అన్నారు.

ఇప్పటికే 24 గంటల విద్యుత్‌ను 19 రాష్ట్రాలకు ఇస్తున్నాయని చెప్పారు. 10 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను కూడా కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర పరిధిలో మూసివేసి ఉన్న కర్మాగారాలను తెరిపించడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్‌ రైతులను దగా చేశారని ఆరోపించారు. మూసివేసిన చక్కెర కర్మాగారాలను తెరిచే వరకు ఉద్యమాలు, పోరాటాలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2.72 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.825 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ.770 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి 4442 ఇళ్లు మాత్రమే నిర్మించారని వివరించారు. పాదయాత్రను ప్రారంభించే ముందు చెరుకు రైతులు, ఉత్పత్తిదారు ల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆశీర్వాదాన్ని ధర్మపురి అరవింద్‌ తీసుకున్నారు.

వర్షకొండ గ్రామంలో మహిళలు, రైతులు బీజేపీ నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలానికి పాదయాత్ర చేరుకుంది. స్థానిక నాయకులు ఆరవింద్, యెండల లక్ష్మీనారాయణకు వీడ్కొలు పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు బాజోజి భాస్కర్, నాయకులు రాజారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, చిన్నారెడ్డి, చంద్రాగౌడ్, పెద్దబోయిన రమేశ్‌ పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top