మహిళను భయపెట్టిన బొమ్మ

Women Scared With It Doll In New Jersey - Sakshi

న్యూజెర్సీ : చిన్న బొమ్మ కారణంగా ఓ మహిళ 24 గంటల పాటు నరకం అనుభవించింది. భయం గుప్పిట్లో విలవిలలాడింది. ఈ సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో  శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీ హ్యారింగ్టన్ పార్క్‌కు చెందిన 42ఏళ్ల రీనీ జెన్‌సన్‌ అనే మహిళ భర్తతో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. గత కొన్నినెలలుగా అలెక్స్‌ పాపజియాన్‌ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శనివారం ఇద్దరూ రీనీ ఇంట్లో ఉన్న సమయంలో అక్కడ ఏదో తేడాగా జరుగుతున్నట్లు వారికి అనిపించింది.  హఠాత్తుగా ఇంటి పెరట్లోని చెట్టుపైనుంచి ఓ బొమ్మ నేరుగా నేలపై పడింది. ఆ బొమ్మ అచ్చం తను గతంలో చదివిన హర్రర్‌ నవల ‘‘ఇట్‌’’ లోని భయంకరమైన బొమ్మలాగా అనిపించింది. అప్పుడు అమెకు పెన్నివైస్‌ అనే కార్టూన్‌ బొమ్మ గుర్తుకువచ్చింది.


అంతే! ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఆ బొమ్మ బట్టతో తయారుచేయబడి, పెదవుల దగ్గర కృత్తిమ రక్తంతో, తలపై మంత్రాల లాంటి సంఖ్యలతో భయంకరంగా కనపడింది ఆమెకు. ఆ వెంటనే రీనీ పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిని పరీక్షించి అక్కడ ఎలాంటి అనుమానిత వస్తువులు, మనుషులు లేరని ధ్రువీకరించారు. వారు వెళ్లిపోయే సమయంలో ఆ బొమ్మను తీసుకుపోవాల్సిందిగా ఆమె కోరింది. అయితే వారు అందుకు ఒప్పుకోలేదు. పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత రీనీ, అలెక్స్‌ ఆ బొమ్మను నాశనం చేయాలనుకున్నారు. మొదటదాన్ని ఆలివ్‌ ఆయిల్‌లో ముంచి అంటించడానికి ప్రయత్నించినా అది కాలలేదు.

చివరకు పాతపేపర్లలో దాన్ని చుట్టి తగబెట్టేశారు.  ఆ సాయంత్రం అలెక్స్‌ ఓ పని మీద బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఆ ఇంట్లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. బొమ్మను కాల్చి బూడిద చేసినప్పటికి ఆమెలో భయం మాత్రం చావలేదు. ఒంటరిగా ఉండటంతో భయంకారణంగా ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారేమోనన్న భయంతో కత్తిని తన వద్ద ఉంచుకుంది. అలసట కారణంగా తెల్లవారిన తర్వాత నిద్రలోకి జారుకుంది. ఈ ఘటనపై రీనీ మాట్లాడుతూ.. ‘‘  ఆ బొమ్మ నన్నెందుకు ఎంచుకుందో అర్థంకావటంలేదు. ఆకాశంలోనుంచో, చెట్టుపైనుంచో అది మా ఇంట్లోకి పడలేదు. చెట్టుమీద నుంచి పాకుతూ వచ్చింది. నాకు హర్రర్‌ సినిమాలంటే ఇష్టం ఉండదు. అంతేకాదు అలాంటి బొమ్మలతో చచ్చేంత భయంనాకు. ఆ రోజు కూడా భయంకరమైన కలలు వచ్చాయ’’ని తెలిపింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top