నిలకడగా పరుగులు తీస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ! 

United States Economy  is constantly growing - Sakshi

పెరుగుతున్న ఉద్యోగాలు - దూకుతున్న మార్కెట్లు

అమెరికా ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలా పుంజుకుని పరుగులు తీస్తోంది. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు ఇంకా ఏడాది నిండకపోయినా అగ్రరాజ్యం వివిధ రంగాల్లో ప్రగతి సాధించి 2018లోకి ప్రవేశిస్తోంది. స్టాక్ మార్కెట్లు, ఉపాధి అవకాశాలు, వినియోగదారుల ఉత్సాహం ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత బాగున్నాయని వార్తలందుతున్నాయి. నవంబర్ నెలలో నిరుద్యోగం 4.1 శాతం వద్ద నిలబడింది. అంటే అమెరికాలో గత 17 సంవత్సరాల్లో ఇది కనిష్ఠ స్థాయికి చేరింది. ఉద్యోగావకాశాలు నిలకడగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది కంపెనీలు లక్షలాది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. డెమొక్రాటిక్ పార్టీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎనిమిదేళ్ల పాలనలో కూడా క్రమం తప్పకుండా కొత్త ఉద్యోగాల సంఖ్య పెరిగిన మాట వాస్తవమేగాని ఆర్థికాభివృద్ధి చాలా నెమ్మదిగా సాగింది. 

స్టాక్ మార్కెట్లో రికార్డులే రికార్డులు!
2017లో అమెరికా స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడుసార్లు రికార్డు తర్వాత రికార్డులు బద్దలయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి అద్దం పట్టే మార్కెట్ సూచీ డౌ జోన్స్‌ ఇండస్ట్రియల్ ఏవరేజ్ తొలిసారి జనవరిలో 20, 000 పాయింట్లు దాటిపోయింది. తర్వాత మార్చిలో 21, 000 పాయింట్లు మించి ముందుకు పరిగెత్తింది. ఆగస్ట్‌ లో 22, 000 దాటిన మార్కెట్ ఇండెక్స్  కిందటి నెల నవంబర్ చివరి రోజున 24, 000 పాయింట్లు దాటి శర వేగంతో ముందుకు దూకింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి పాలనలో కొంత గందరగోళం కనపించినా ఆర్థిక వ్యవస్థ మాత్రం తన మార్గంలో ముందుకు పయనిస్తోందనడానికి ఇవే సాక్ష్యాధారాలు.

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మూడుసార్లు వడ్డీ రేట్లు పెంచింది. ఆర్థిక ప్రగతి అవకాశాలు మెరుగైన కారణంగానే బ్యాంకు రేట్లు పెంచారు. అగ్రరాజ్య ఆర్థికాభివృద్ధి ఇదే స్పీడులో కొనసాగితే వచ్చే సంవత్సరం కూడా వడ్డీరేట్లను ఫెడ్ మూడుసార్లు పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఫెడ్ ప్రస్తుత చీఫ్ జానెట్ యెలెన్ స్థానంలో కొత్త గవర్నర్గా జెరోమ్ పావెల్ను ఇటీవల ట్రంప్ నియమించారు. అయినా, జానెట్ మార్గంలోనే కొత్త గవర్నర్ పయనిస్తారేగాని రేట్లను అడ్డదిడ్డంగా మార్చరని అంచనావేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడిందనీ, ప్రగతిమార్గంలో పయనిస్తోందనే నమ్మకం కలిగాకే వడ్డీ రేట్లు ఈ ఏడాది పెంచారు.

అభివృద్ధికి అనేక కారణాలు
ముగుస్తున్న ఈ సంవత్సరంలో అనూహ్యమైన ప్రగతికి అనేక అంశాలు తోడ్పడ్డాయి. ఉద్యోగావకాశాలతోపాటు నియామకాలు ఊపందుకున్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాలకు అనుకూలంగా అధ్యక్షుడు ట్రంప్ అజెండా ముందుకొచ్చింది. దీంతో ఆశలు, అంచనాలు పెరిగాయి. ఎన్నో ఏళ్లుగా కుంటి నడక నడుస్తున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు గాడిన పడ్డాయి. ఈ అంశాలన్నీ  అభివృద్ధి బాటలో అమెరికా పయనానికి సహకరించాయి.

యూరప్ సహా మిగతా ప్రపంచంలో ప్రగతి రథ చక్రాలు ముందుకుసాగుతున్న మాట వాస్తవమేగాని అమెరికా పారిశ్రామిక, వ్యాపార రంగాలు మాత్రం గట్టి పునాదులతో కొత్త సంవత్సరంలోకి ఉత్సాహంతో అడుగు పెడుతున్నాయి. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఒకసారి మందగించాక మళ్లీ కోలుకుని ప్రగతిపథంలో పయనించడానికి ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం దాని చరిత్రలో మూడోసారి. అయితే, ఆర్థిక వ్యవస్థ వేగంతో సంబంధం లేకుండా 2018లో మూడు నాలుగుసార్లు బ్యాంక్ రేట్లు పెంచడం మంచిది కాదని న్యూయార్క్ వాల్ స్ట్రీట్‌ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top