‘వారిలో నిజాయితీ లేదు.. ఓడిపోయేందుకు అర్హులే’

UK Girl Now Pregnant Who Joined IS Wants To Come Home Back - Sakshi

మొన్న లియోనారా... నేడు షమీమా బేగం.. సిరియాలోని డెమొక్రటిక్‌ క్యాంపుల్లో ఆవాసం పొందుతున్న.. ఇలాంటి ఇంకెందరో టీనేజర్లు స్వదేశానికి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించాలంటే చట్టపరంగా, రాజకీయపరంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం రాజ్య స్థాపనే ధ్యేయంగా సిరియా, ఇరాక్‌లలో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌కు వీరు ఒకప్పటి సానుభూతి పరులు. తెలిసీ తెలియని వయస్సులో వేసిన తప్పటడుగు ఇప్పుడు వీరికి, వీరి సంతానానికి పెనుశాపంగా మారింది.

వారిద్దరితో పాటు..
షమీమా బేగం బంగ్లాదేశీ- బ్రిటీష్‌ టీనేజర్‌(19). లండన్‌లోని బెత్నల్‌ గ్రీన్‌ అకాడమీలో చదువుకునేది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే షమీమా ఐఎస్‌ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్‌ నుంచి సిరియాకు పారిపోయింది. ఈ విషయం అప్పట్లో లండన్‌ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. పిక్‌నిక్‌కి వెళ్తున్నామని చెప్పి పరారైన ఈ ముగ్గురు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఖతీజా ఐసిస్‌- కుర్దిష్‌ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయింది. అమైరా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.

ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్‌ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా బాగానే గడిచిన ఆమె జీవితం పెళ్లి తర్వాత దుర్భరంగా మారింది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో షమీమా ఆరోగ్యం క్షీణించింది.

లండన్‌లో అయితే నా బిడ్డ భద్రంగా ఉంటుంది..
ఇదిలా ఉండగా ఐఎస్‌ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్‌ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్‌ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డీఎఫ్‌) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్‌డీఎఫ్‌ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి.

ఈ విషయం గురించి షమీమా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నిండు గర్భిణిని. నాలుగేళ్ల క్రితంలా ఇప్పుడు నాది చిన్నపిల్లల మనస్తత్వం కాదు. బ్రిటన్‌ వెళ్తే కనీసం నాకు పుట్టబోయే బిడ్డ అయినా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నరకబడిన ఓ మనిషి తలను మా డస్ట్‌బిన్‌లో మొదటిసారి చూసినపుడు నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ వ్యక్తికి అదే సరైన శిక్ష అని భావించాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐసిస్‌ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. వారిలో నిజాయితీ లేదు కాబట్టి ఓడిపోయేందుకు వారు అర్హులు. ఇక కాలిఫేట్(ఐసిస్‌ స్థాపించాలనుకున్న రాజ్యం పేరు) స్థాపన అసాధ్యం’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.(ఇంటికి వెళ్లాలని ఉంది)

ఇక్కడకు తీసుకొచ్చి శిక్షిద్దాం..
తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్‌డీఎఫ్‌ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఐసిస్‌ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్‌డీఎఫ్‌ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఈ క్రమంలో బ్రిటన్‌కు తీసుకువచ్చిన తర్వాత.. ఐసిస్‌కు ఒకప్పుడు మద్దతుగా నిలిచిన కారణంగా షమీమా వంటి వారిని శిక్షించినా ఫర్వాలేదు గానీ.. వారికిప్పుడు కనీస సాయం అందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌ రక్షణ మంత్రి బెన్‌ వాల్లాస్‌ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఏదేమైనా టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా, షమీమాలాగే మరికొంత మంది ఐఎస్‌ కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ‘ఐఎస్‌’ ఎక్కడో కాకుండా ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది!
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top