కాలేయం కలిపింది ఇద్దరినీ..! | Sakshi
Sakshi News home page

కాలేయం కలిపింది ఇద్దరినీ..!

Published Fri, Nov 4 2016 3:04 AM

కాలేయం కలిపింది ఇద్దరినీ..!

కోడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్న క్రిస్ డెంప్సీ తన గదిలో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో క్రుగర్ సోదరుడు జాక్ తన సోదరి పరిస్థితి గురించి సహోద్యోగులతో చెప్పి బాధపడటం డెంప్సీ విన్నాడు. వెంటనే జాక్ దగ్గరకు వెళ్లి.. కాలేయం ఇవ్వడానికి తాను సిద్ధమని చెప్పాడు. క్రిస్ ఎప్పుడూ క్రుగర్‌ను చూడలేదు. అస్సలు ఆమె ఎవరో కూడా తెలియదు. అయినా సరే తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఈ విషయం తెలిసి క్రుగర్ నోట మాట రాలేదు. ఆనందంతో ఆమె కళ్లు తడిసిపోయాయి.

2014 మార్చి 20..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్..
27 ఏళ్ల హీదర్ క్రుగర్ కళ్లలో నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇంక తాను జీవించేది కొన్ని నెలలు మాత్రమే అన్న విషయం అప్పుడే ఆమెకు తెలిసింది. లివర్ కేన్సర్ నాలుగో దశలో ఉంది. వెంటనే కాలేయ మార్పిడి చేస్తే తప్ప ఆమె జీవించే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేశారు. లివర్ కోసం తమ పేరు నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నవారి జాబితా చాంతాడంత ఉంది. అందులో తన వంతు వచ్చేసరికి ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. ఇక మిగిలి ఉన్న అవకాశం ఎవరిదైనా కాలేయంలోని కొంత భాగాన్ని తీసి క్రుగర్‌కు అమర్చడమే. కానీ అందుకు ఎవరు ముందుకు వస్తారు? ‘ఇక కొన్ని రోజుల్లో నా జీవితం ముగిసిపోనుంది. ఆ విషయం ఊహిస్తేనే చాలా భయంగా ఉంది’ అంటూ వణుకుతున్న చేతులతో క్రుగర్ తన డైరీలో రాసుకుంది.
 
2016 అక్టోబర్ 5..ఇల్లినాయీలోని ఫ్రాంక్‌ఫోర్ట్..
తెల్లని పెళ్లి గౌనులో క్రుగర్ మెరిసిపోతోంది. ఆమె మోములో చిరునవ్వు తాండవిస్తోంది. పక్కనే సూటులో క్రిస్.. బంధుమిత్రుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ‘నా జీవితంలో నేను చూసిన అద్భుతమైన వ్యక్తివి నువ్వు.. నా నవ్వుకు, ఆనందానికి కారణం నువ్వు.. మూతపడబోయిన నా కనులకు మళ్లీ కలలు కనే అవకాశం కల్పించిందీ నువ్వే.. ఈ నవ్వు, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి’ అంటూ డైరీలో రాసుకుంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement