మూతపడుతున్న ‘ది ఇండిపెండెంట్’

మూతపడుతున్న ‘ది ఇండిపెండెంట్’


లండన్: పీక్‌టైమ్‌లో నాలుగు లక్షలకు పైగా సర్కులేషన్‌గల ‘ది ఇండిపెండెంట్’ జాతీయ ఆంగ్ల దిన పత్రికను మూసివేసి, డిజిటల్ గ్లోబల్ ఇండిపెండెంట్ పత్రికపైనే దృష్టిని కేంద్రీకరించాలని ఈ పత్రికను ప్రచురిస్తున్న ఈఎస్‌ఐ మీడియా నిర్ణయించింది. లండన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి జాతీయ దిన పత్రిక ఇదే. దిన పత్రిక సర్కులేషన్ రోజురోజుకు తగ్గి పోతుండడం, ఆన్‌లైన్ డిజిటల్ పత్రికకు రోజురోజుకు వీక్షకులు పెరిగిపోతుండడం, రానున్న కాలమంతా డిజిటల్ పత్రికలదే హవా అని గ్రహించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మీడియా ప్రకటించింది. చివరి సంచిక మార్చిలో వెలువడుతుందని వెల్లడించింది.



 ‘ఇండిపెండెంట్ డాట్ కో డాట్ యూకే’ పత్రిక గత మూడేళ్ల నుంచి నాణ్యమైన పత్రికగా డిజిటల్ రంగంలో దూసుకుపోతోందని, గత 12 నెలల్లో 33.3 శాతం వ్యూహర్లు దీనికి పెరిగిపోయారని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది యూజర్లు ఉన్నారని, లాభాలు కూడా ఫర్వలేదని ఈఎస్‌ఐ మీడియా తెలిపింది. ఈ ఏడాది యాడ్ రెవెన్యూ కూడా 50 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొంది.




వార్తా పత్రికల్లో యాడ్ రెవెన్యూ ఎక్కువగా ఉన్నప్పటికీ రీడర్ అభిష్టానుసారం తాము డిజిటల్ వైపే మొగ్గు చూపిస్తున్నామని, డిజిటల్ పత్రికగా మారినప్పటికీ నాణ్యతాపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తామని ‘ది ఇండిపెండెంట్’ యజమాని ఎవజెనీ లెబెడెవ్ ప్రకటించారు. నాణ్యతాపరమైన జర్నలిజం కోసమే తన కుటుంబం ఈ పత్రికలో పెట్టుబడులు పెట్టిందని వివరించారు. లండన్ కేంద్రంగా 1986లో ది ఇండిపెండెంట్ పత్రికను స్థాపించారు.



ఇండిపెండెంట్ పత్రికను మూసివేసినా, పత్రిక టైటిల్‌ను మరొకరికి విక్రయించినా ఈఎస్‌ఐ సంస్థ నుంచే వెలువడుతున్న ‘లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్’ ప్రచురణ కొనసాగుతుందని మీడియా వర్గాలు తెలిపాయి.  ప్రస్తుతం పత్రికలో పనిచేస్తున్న దాదాపు 250 మంది జర్నలిస్టులను ఎలాంటి అన్యాయం జరగదని, ఉద్యోగులను తీసుకునే షరతుపైనే టైటిల్‌ను విక్రయిస్తామని ఆ వర్గాలు వివరించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top