మలాలాపై దాడి : సూత్రధారి హతం

Terrorist Who Planned Attack On Malala Killed - Sakshi

కాబుల్‌, అఫ్గానిస్తాన్‌ : మలాలా యూసఫ్‌ జాయ్‌పై దాడి సూత్రధారిని అఫ్గానిస్తాన్‌లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ తాలిబన్‌ నాయకుడు ముల్లా ఫజ్లుల్లా హతమయ్యాడు.

ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేసిన డ్రోన్‌ దాడుల్లో ఉగ్రవాద నాయకుడు హతమైనట్లు అమెరికా ప్రకటించింది. అయితే, అతని పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ దాడిలో చనిపోయింది మలాలాపై దాడికి ఆదేశించిన ముల్లా ఫజుల్లా అని అఫ్గాన్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, పలువురు కమాండర్లు ఇఫ్తార్‌ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్‌లోని తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఆ ఘటనలో 151 మంది చిన్నారులు బలయ్యారు. మరో 130 మంది గాయపడ్డారు. ఫజ్లుల్లాపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top