యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని..
న్యూయార్క్: యోగాను ఏదో ఒక మత కార్యక్రమంగా చూడరాదని.. ఈ పురాతన అధ్యాత్మిక ఆచరణ.. ప్రతికూల పోకడలకు ఔషధంగా పనిచేయగలదని.. హింస, ఘర్షణలతో సతమతమవుతున్న ప్రపంచంలో మానవులను శాంతి మార్గంలో నడిపించగలదని భారత్ పేర్కొంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ‘‘యోగా అంటే.. కలవటం, ఐక్యం కావటం అని అర్థం.
ప్రపంచమంతా ఒక కుటుంబం. దానిని మనం యోగాతో సమైక్యం చేయగలం. ‘వసుధైక కుటుంబం’ అనే భారత ఉత్తమ సంప్రదాయంలో.. స్నేహం, సోదరభావాల సందేశాన్ని విస్తరించటానికి ఐరాస యోగా ఒక సమర్థవంతమైన సాధనం. యోగా అనేది ఒక మతం కాదు. దానిని ఏదో మతానిదిగా చూడరాదు. అదొక శాస్త్రం. ఆరోగ్యరంగా ఉండే శాస్త్రం. శరీరం, మనసు, ఆత్మలను సమైక్యం చేసే శాస్త్రం.
మన వాస్తవ సామర్థ్యాన్ని సాకారం చేసే శాస్త్రం’ అని అభివర్ణించారు. సమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, సర్వసభ్య సభ అధ్యక్షుడు శాం కుటేశ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు తుల్సీ గబ్బార్డ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెనీవాలోని ఐరాస కార్యాలయంలో డెరైక్టర్ జనరల్ మైఖేల్ ముల్లర్ అధ్యక్షతన యోగా డే నిర్వహించారు.