బాబోయ్‌ భారత్‌

Survey Says India Is Most Dangerous Country For Women - Sakshi

పదో స్థానంలో అమెరికా 

థాంప్సన్‌ రాయటర్స్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడి

భారత్‌ ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చిన విషయమిది. దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చేదు వాస్తవమిది. మహిళల రక్షణపై తాజా సర్వే మన పరువు తీసేసింది. మహిళలకు భారతదేశమే అత్యంత ప్రమాదకరమైనదని థాంమ్సన్‌ రాయటర్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అత్యాచారాలు, లైంగిక హింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సెక్స్‌ బానిసలుగా మార్చడం, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో వెట్టిచాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అమానవీయమైన సంప్రదాయ పద్ధతులు వంటి అంశాల్లో మహిళలకు భారత్‌ చాలా ప్రమాదకరంగా మారిందని సర్వే తేల్చింది. 

నిరంతరం యుద్ధంతో అతలాకుతలమయ్యే అఫ్గానిస్తాన్, సిరియాల్లో కంటే మన దేశంలో మహిళలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలడం ఎవరికీ మింగుడు పడడం లేదు. ఈ  జాబితాలో అఫ్గానిస్తాన్‌ రెండు, సిరియా మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో సోమాలియా, సౌదీ అరేబియా దేశాలు ఉంటే అగ్రరాజ్యం అమెరికా పదో స్థానంలో ఉంది. ఇదే సంస్థ 2011 సంవత్సరంలో నిర్వహించిన సర్వేలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

సర్వేలో ప్రామాణికంగా తీసుకున్న అంశాలు
మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ఆరోగ్యం, ఆర్థిక వనరులు, లింగ వివక్ష, లైంగిక హింస–వేధింపులు, ఇతరత్రా హింసలు, అక్రమ రవాణా, సాంస్కృతికంగా, మతపరంగా వస్తున్న సంప్రదాయ పద్ధతులు వంటి అంశాలను థామ్సన్‌ రాయటర్స్‌ ఫౌండేషన్‌ సర్వేలో ప్రామాణికంగా తీసుకుంది. ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన 193 దేశాల్లోని మహిళా సమస్యలపై అధ్యయనం చేస్తున్న 548 నిపుణుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. మార్చి 26–మే4 మధ్య ఆన్‌లైన్‌ ద్వారా, ఫోన్‌ ద్వారా, వ్యక్తిగతంగా కలుసుకొని సర్వే నిర్వహించింది. వీరంతా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశం భారతేనని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంప్‌ రేప్, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన రేపిన కల్లోలం నేపథ్యంలోనే ఈ సర్వే రావడం ఆందోళన కలిగిస్తోంది.

వివిధ అంశాల్లో భారత్‌ ర్యాంకింగ్‌

 • లైంగిక హింసలో మొదటి స్థానం 
 • అక్రమ రవాణాలో మొదటి స్థానం
 • సంప్రదాయంగా వస్తున్న అనాచారాల్లో మొదటి స్థానం
 • లింగవివక్షలో మూడో స్థానం
 • గృహ హింస ఇతర శారీరక హింసల్లో మూడో స్థానం
 • మహిళల ఆరోగ్య పరిస్థితుల్లో నాలుగో స్థానం

మహిళలకు అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
1. భారత్‌
2. అప్గానిస్థాన్‌
3. సిరియా
4. సోమాలియా
5. సౌదీ అరేబియా
6. పాకిస్తాన్‌
7. డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
8. యెమన్‌
9. నైజీరియా
10. అమెరికా

దేశానికే అవమానం : రాహుల్‌ గాంధీ 
మన ప్రధాని నరేంద్ర మోదీ తన తోటలో తిరుగుతూ యోగా వీడియోలు రూపొందించడంలో నిమగ్నమై ఉంటే, మహిళలపై అత్యాచారాలు, హింసలాంటి అంశాల్లో అఫ్గానిస్తాన్, సిరియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు మనం నేతృత్వం వహిస్తున్నాం. నిజంగా మన దేశానికి ఇదెంత అవమానం అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. 

గంటకి నాలుగు అత్యాచారాలు
మన దేశంలో ఎటు చూసినా మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. 2012లో న్యూఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలకు రక్షణ కల్పించాలంటూ దేశవ్యాప్తంగా యువతీ యువకులు రోడ్డెక్కడంతో నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదు. జాతీయ నేర గణాంకాల సంస్థ ప్రకారం

 • ప్రతీ గంటకి నలుగురు మహిళలపై అత్యాచారం
 • ప్రతీ గంటలో మహిళలపై 26 నేరాలు
 • ప్రతీ రోజూ వందకి పైగా లైంగిక దాడి కేసులు నమోదు
 • గంటకి అయిదుగురు మహిళల ప్రసూతి మరణాలు
 • ప్రతీ రోజూ 21 వరకట్న మరణాలు
 • ఏడాదికి 34,651 అత్యాచార కేసులు నమోదు
 • మహిళలపై ఏడాదికి నమోదవుతున్న నేరాల సంఖ్య 3,27,394
 • దేశంలో మహిళలపై జరిగే మొత్తం నేరాల్లో ఢిల్లీ వాటా 52%
 • 2007–16 మధ్య కాలంలో మహిళలపై నేరాల్లో పెరుగుదల 83%
 • ఇందులో మరణాలే ఎక్కువగా ఉన్నాయి. 
Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top