
చికాగొ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే మనుబోలు మండలం మడమనూరుకు చెందిన డేగా ధీరజ్ రెడ్డి ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చికాగోలోని సెయింట్ లూయీస్‌కు ఓ పని నిమిత్తం వెళ్లి అక్కడ సెల్లార్‌లో కారును పార్కింగ్ చేస్తుండగా నల్ల జాతీయులు అతడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయలపాలైన ధీరజ్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం ధీరజ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
ధీరజ్ ఉదర భాగం ఎడమ వైపు నుంచి శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ కుడి వైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ధీరజ్ శరీరంలో బులెట్ ఇంకా అలాగే ఉండిపోవడంతో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ధీరజ్ రెడ్డి హార్ట్ బీట్, బీపీ లెవల్స్ గత రాత్రితో పోలిస్తే సాధారణంగా ఉండడంతో అతడు త్వరగా కోలుకుంటాడని మిత్రలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ధీరజ్ రెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ధీరజ్ త్వరగా కోలుకోవాలంటూ గో ఫౌండ్ మీ అనే సంస్థ మద్దతుగా నిలిచింది. 'అతను త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీ మద్దతు ఉండాలంటూ' గో ఫౌండ్ సంస్థ పేర్కొంది.