breaking news
manubolu mandal
-
అమెరికాలో నెల్లూరు యువకుడిపై కాల్పులు
చికాగొ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే మనుబోలు మండలం మడమనూరుకు చెందిన డేగా ధీరజ్ రెడ్డి ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చికాగోలోని సెయింట్ లూయీస్‌కు ఓ పని నిమిత్తం వెళ్లి అక్కడ సెల్లార్లో కారును పార్కింగ్ చేస్తుండగా నల్ల జాతీయులు అతడిపై తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయలపాలైన ధీరజ్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకుంది. కాగా ప్రస్తుతం ధీరజ్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ధీరజ్ ఉదర భాగం ఎడమ వైపు నుంచి శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ కుడి వైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ధీరజ్ శరీరంలో బులెట్ ఇంకా అలాగే ఉండిపోవడంతో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ధీరజ్ రెడ్డి హార్ట్ బీట్, బీపీ లెవల్స్ గత రాత్రితో పోలిస్తే సాధారణంగా ఉండడంతో అతడు త్వరగా కోలుకుంటాడని మిత్రలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ధీరజ్ రెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ధీరజ్ త్వరగా కోలుకోవాలంటూ గో ఫౌండ్ మీ అనే సంస్థ మద్దతుగా నిలిచింది. 'అతను త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మీ మద్దతు ఉండాలంటూ' గో ఫౌండ్ సంస్థ పేర్కొంది. -
పర స్త్రీ వ్యామోహంలో.. ప్రాణాలు కోల్పోయాడు
సాక్షి, మనుబోలు: భార్యాబిడ్డలను నిర్లక్ష్యం చేసి పర స్త్రీ వ్యామోహంలో పడిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నెల్లూరు జిల్లా మండలంలోని పిడూరుమిట్టలో ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడి భార్య కథనం మేరకు.. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఆలకుంట వీరరాఘవులు (25) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య సుభాషిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు ఏడాది క్రితం వీరరాఘవులు పని నిమిత్తం నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్లు ద్వారా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండలం బట్టుపల్లి వద్ద ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి వెళ్లాడు. నెల రోజులు అక్కడ పని చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడూ తిరిగి అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఈ క్రమంలో 3 నెలలుగా వీరరాఘవులు ఇంటికి రాకపోవడంతో భార్య సుభాషిని ఆరా తీసింది. వీరరాఘవులు బట్టుపల్లి గ్రామంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న ఓ వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో సుమారు నెల క్రితం వీరరాఘవులు బట్టుపల్లికి చెందిన మహిళతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త గంగాధర్ వీరరాఘవులు భార్య సుభాషిణికి ఫోన్‌చేసి విషయాన్ని చెప్పి, తన భార్యను అప్పగించమని చెప్పు, లేదంటే నీ పిల్లలను ఎత్తుకెళ్లిపోతానని బెదిరించాడు. ఈ విషయం సుభాషిని ఫోన్ ద్వారా భర్త వీరరాఘవులుకు చెప్పింది. అదేం లేదు.. అతని భార్యను అతనికి అప్పగించేశానని చెప్పాడు. ఆ తర్వాత సుభాషిణి తన భర్తకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవలేదు. ఈ నెల 9వ తేదీ ఉదయం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒళ్లంతా దెబ్బలతో ఉన్న వీరరాఘవుల్ని పిడూరుమిట్టలోని సుభాషిని ఇంట్లో వదిలి వెళ్లారు. సుభాషిని భర్తను ఆరాగా తీయగా బట్టుపల్లికి చెందిన వివాహితను తీసుకుని నెల రోజుల క్రితం నెల్లూరుకు వచ్చానని, 15 రోజులు ఉండి, ఆమె తన భర్త వద్దకు వెళ్లిపోయిందని వీరరాఘవులు తెలిపాడు. ఆమె సెల్‌ఫోన్, కొద్దిగా బంగారం తన వద్ద ఉండిపోవడంతో వాటిని ఇస్తానని ఫోన్లో చెప్పగా బట్టుపల్లికి తీసుకుని రమ్మందని తెలిపిందని తెలిపాడు. తాను ఫోన్, బంగారం ఇచ్చేందుకు ఈ నెల 7వ తేదీన బట్టుపల్లికి వెళ్లగా ఊరి బయట ఆమెను కలవగా ఇంతలో ఆమె భర్త గంగాధర్ వచ్చి ఇద్దరూ కలిసి కర్రలతో తీవ్రంగా కొట్టారని తెలిపాడు. తీవ్రంగా గాయపడిన భర్తను సుభాషిణి చికిత్స నిమిత్తం మొదట గూడూరు, నెల్లూరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించి, మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స పొందుతూ శనివారం వీరరాఘవులు మృతి చెందాడు. దీంతో తన భర్త మరణానికి కారణమైన బట్టుపల్లికి చెందిన గంగాధర్, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని ఆదివారం మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఘటన జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని, మహబూబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదం: ఎస్ఐతోపాటు కానిస్టేబుళ్లకు గాయాలు
నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పొందుసత్రం వద్ద పోలీస్ వ్యాన్ - స్కార్పియో వాహనం శనివారం తెల్లవారుజామున ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.