
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): తండ్రి కష్టాలను చూసి పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు చలించిపోయాడు. బాగా చదువుకుని అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలనుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో శ్రమే ఆయుధంగా కష్టపడ్డ ఆ యువకుడు 24 ఏళ్ల చిన్నవయసులోనే స్విట్జర్లాండ్‌లోని క్రెడిట్ స్విస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు. అతడే బండారు సునీల్‌కుమార్.
పేదరికం నుంచి ప్రతిభావంతుడిగా..
సునీల్‌కుమార్ తండ్రి శ్రీనివాస్‌ది విజయనగరం జిల్లా అలమండ సంత గ్రామం. పేదరికం వెంటాడటంతో ఆయన 16 ఏళ్ల వయసులోనే విశాఖపట్నం చేరుకున్నాడు. ముందు గోపాలపట్నంలో చిన్నచిన్న దుకాణాల్లో పనిచేసి ప్రస్తుతం విశాఖలోని ఇందిరానగర్‌లో కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే భార్య భవానిని, కుమారుడు సునీల్ కుమార్‌ను, కుమార్తె ప్రియాంకను పోషిస్తున్నాడు. సునీల్ చిన్నతనం నుంచే ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. పదో తరగతిలో 513 మార్కులు సాధించాడు. ఎంసెట్‌లో 682 ర్యాంకు, ఐఐటీ జేఈఈలో 7000 ర్యాంకు పొందాడు.
కుటుంబ సభ్యులతో సునీల్‌కుమార్
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)లో ఇంటిగ్రేటెడ్ పీజీ పూర్తి చేసి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ చేతులమీదుగా పట్టా అందుకున్నాడు. పీజీ పూర్తిచేసిన తర్వాత ముంబైలోని క్రెడిట్ స్విస్ బ్యాంక్ (స్విట్జర్లాండ్)లో రిస్క్ ఎనలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 24 ఏళ్ల చిన్న వయసులోనే ఆ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యాడు. కాగా, సునీల్ సోదరి ప్రియాంక ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
శ్రమనే దైవంగా భావించా..
నాన్న కష్టాన్ని కళ్లారా చూశాను. కిరాణా కొట్టులో నాన్నకు సాయం చేసేవాడిని. నేటి విద్యార్థులు ఇంజనీరింగ్‌పై మాత్రమే కాకుండా మిగతా అవకాశాలపై దృష్టి సారించాలి. కోల్‌కతా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రమనే దైవంగా భావించి కష్టపడటంతో ఈ స్థాయికి చేరుకున్నా. – సునీల్‌కుమార్