ఉద్రిక్తతలకు దారితీసిన ఫేస్‌బుక్‌ పోస్టు 

Sri Lanka Prohibit Social Media Over Bomb Attacks - Sakshi

సోషల్‌మీడియాపై మళ్లీ నిషేధం

శ్రీలంకలో ఇరువర్గాల మధ్య ఘర్షణ 

గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

కొలంబో: శ్రీలంక ప్రభుత్వం సోషల్‌మీడియాపై నిషేధం విధించింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సప్‌ శ్రీలంకవాసులకు అందుబాటులో లేకుండాపోయాయి. ఫేస్‌బుక్‌లో తాజాగా పెట్టిన ఓ పోస్టు ఆధారంగా చిలా పట్టణంలో కొంత మంది క్రిస్టియన్‌ వర్గీయులు స్థానికంగా ఉన్న ఓ ముస్లిం వ్యాపారస్థుని దుకాణంపై దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారికి చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా.. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన మరికొన్ని ప్రాంతాలకూ పాకింది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది.

అబ్దుల్‌ హమీద్‌ అనే 38 ఏళ్ల దుకాణదారుడు ఈ పోస్టు పెట్టినట్టు సంబంధిత అధికారులు గుర్తించారు. ‘మరీ అంతపగలబడి నవ్వమాకండి. ఒకరోజు మీరూ ఏడుస్తారు’అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ పోస్టుపై స్థానిక క్రైస్తవులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలోనూ బాంబు దాడి ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొట్టడంతో శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న వదంతులు చక్కర్లు కొడుతుండడంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి ఇంకా భయపడుతున్నారు. చాలా రోజుల విరామం తరవాత సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి.

అయితే హాజరు శాతం మాత్రం పెద్దగా నమోదు కాలేదు. పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరని అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ఏప్రిల్‌ 21న ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా వరుస ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో 250 మందికి పైగా చనిపోగా.. దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు ఐసిస్‌ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. లంక ప్రభుత్వం మాత్రం స్థానిక తీవ్రవాద సంస్థ అయిన నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తోంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top