మహింద రాజపక్సేకు భారీ షాక్‌

Sri Lanka Parliament Passed No Confidence Motion Against Mahinda Rajapaksa - Sakshi

కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహింద రాజపక్సేకు బుధవారం గట్టి షాక్‌ తగిలింది. నేడు అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ పార్లమెంట్‌ రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న అనుహ్య నిర్ణయాలతో శ్రీలంక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో దేశ ప్రధానిగా విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో రాజపక్సేను నియమిస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విక్రమసింఘే తను ప్రధాని బంగ్లాను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. పార్లమెంట్‌ స్పీకర్‌ జయసూరియ కూడా సిరిసేన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ సిరిసేన మరో అడుగు ముందుకేసి దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కాగా, సిరిసేన నిర్ణయాలపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్లమెంట్‌ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం చెల్లదని మంగళవారం పేర్కొంది. ఎన్నికల ఏర్పాట్లకు చేస్తున్న ఏర్పాట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పార్లమెంట్‌ రద్దు చెల్లదని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో స్పీకర్ బుధవారం అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరిచారు. ఈ సందర్భంగా రాజపక్సపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపినట్టు స్పీకర్‌ ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top