స్పేస్‌ ఎక్స్‌.. నింగిలోకి వ్యోమగాములు

SpaceX Rocket Lifts Off From Kennedy Space Center - Sakshi

ఫ్లోరిడా : అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ ప్రైవేటు సంస్థకు చెందిన రాకెట్‌.. ఇద్దరు నాసా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) తీసుకెళ్లింది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ప్రయోగంపై అందరిలోను ఆసక్తి నెలకొంది. నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి శనివారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ ఎక్స్‌ రూపొందించిన ఈ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా డగ్లస్ హర్లీ మరియు రాబర్ట్ బెంకెన్‌ అంతరిక్షంలోకి ప్రయాణమయ్యారు. దాదాపు 19 గంటల ప్రయాణం తర్వాత వీరు ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. అక్కడ ఉన్న రష్యా వ్యోమగాములు అనాటోలీ ఇవానిషిన్‌, ఇవాన్‌ వాగ్నెర్‌, అమెరికా వ్యోమగామి క్రిస్‌ కాసిడీలను కలుసుకోనున్నారు.

ఈ ప్రయోగంపై స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌ మస్క్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనతోపాటు స్పేస్‌ ఎక్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరి కల అని తెలిపారు. మరోవైపు ఈ ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పలువురు అధికారులతో కలిసి వీక్షించారు. ‘ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు మేము అమెరికా గడ్డపై నుంచి, అమెరికన్‌ రాకెట్లలో, అమెరికా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top