తుమ్మితే 8 మీటర్ల వరకు తుంపర్లు

తుమ్మితే 8 మీటర్ల వరకు తుంపర్లు


లండన్‌: అనుకోకుండా తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే అవి తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు కాకపోవడమే. కానీ అవి ఇతరులకు తీవ్రమైన అంటు రోగాలను కలిగించే ప్రమాదం ఉంది. అసలు తుమ్మినా, దగ్గినా వెలువడే లాలాజలం, శ్లేష్మం తుంపర్లు ఎంతదూరం ప్రయాణిస్తాయో తెలుసుకునేందుకు కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ నిపుణులు ప్రయత్నించి విజయం సాధించారు.


సెకండుకు వేలాది ఫ్రేమ్స్‌ను తీయగల అత్యాధునిక కెమేరాలను ఉపయోగించి మనిషి తుమ్ములు, దగ్గుల నుంచి వెలువడే లాలాజలం, శ్లేష్మం ప్రయాణించే దూరాన్ని వీడియో తీశారు. తుమ్మినా, దగ్గినా వెలువడే బిందువులు, తుంపర్లు ఒకటి, రెండు మీటర్లకు మించి దూరం ప్రయాణించవని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. కానీ వీడియో రికార్డు ద్వారా తేలిందేమంటే తుమ్మితే తుంపర్లు ఎనిమిది మీటర్ల వరకు, దగ్గితే ఆరు మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి ప్రయాణ దూరంలో కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి.పెద్ద బిందువులు తక్కువ దూరం, చిన్న తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని ఇంతకాలం శాస్త్రవేత్తలు పొరపాటు పడ్డారు. పెద్ద బిందువులే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.


నోటీ నుంచి లాలాజలం, ముక్కు నుంచి శ్లేష్మం తొలుత పలకలుగా బయల్దేరి గాలి ఒత్తిడి కారణంగా బిందువులుగాను, తుంపర్లుగాను మారి వాతావరణంలో కలసిపోతాయి. ఆ తుంపర్లు వాతావరణంలో స్థిరపడడానికి కూడా పది నిమిషాల సమయం పడుతుందని అధ్యయనంలో వెల్లడైంది.  రోగుల లాలాజలం ద్వారా సంక్రమించే అంటు రోగాలు రోగికి ఆరేడు మీటర్ల దూరంలో ఉన్నప్పటికే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని ఈ అధ్యయనం ద్వారా  తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top