అద్భుత విజయాలతో పాటు..ఓటములు సైతం..

Serge Haroche Says ISRO Will Fix Moon Lander Problem - Sakshi

నోబెల్‌ బహుమతి గ్రహీత, ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జ్‌ హారోచ్‌

చండీగఢ్‌ : సైన్స్‌ అంటేనే తెలియని విషయాలను తెలుసుకోవడం అని.. ఆ క్రమంలో ఒక్కోసారి అపజయాలు కూడా ఎదురవుతాయని నోబెల్‌ బహుమతి గ్రహీత, ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జ్‌ హారోచ్‌ అన్నారు. అద్భుత విజయాలతో పాటు ఓటములను సైతం చిరునవ్వుతో స్వీకరించి వాటిని అధిగమించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. చండీగఢ్‌లో జరుగుతున్న ‘నోబెల్‌ ప్రైజ్‌ సిరీస్‌ ఇండియా 2019’ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్జ్‌ మాట్లాడుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందని తాను భావించడం లేదన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌కు ఏమైందో తనకు తెలియదు గానీ.. ఇస్రో కచ్చితంగా సమస్యను పరిష్కరించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

‘సైన్స్‌ విభాగంలో పనిచేసే వారు అస్సలు నిరాశ చెందకూడదు. ప్రయోగాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారన్న మాట నిజమే. ఆర్థిక అంశాలతో పాటు రాజకీయాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి. ఒక ప్రయోగం చేపట్టేపుడు మీడియా విపరీతంగా కవర్‌ చేయడం... ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా అది పెద్దదిగా కనిపించడం సహజమే. అంచనాలు పెరిగే కొద్దీ విమర్శల స్థాయి కూడా పెరుగుతుంది. యువత మెదళ్లపై పెట్టే పెట్టుబడే ఏ దేశానికైనా అత్యుత్తమైనది. యువ సంపద భారీగా ఉన్న భారత్‌ ఈ మేరకు పెట్టుబడులు పెడుతూ విదేశాల్లో ఉన్న తమ వాళ్లను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. గణిత, భౌతిక శాస్త్రాలతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్‌లో కూడా భారత్ నాణ్యమైన విద్యనందిస్తోంది. చంద్రయాత్ర వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీడియా ప్రచారం కల్పించే ఖర్చుతో మరిన్ని చిన్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చనేది నా భావన’ అని సెర్జ్‌ పేర్కొన్నారు.

అదే విధంగా వాతావరణ మార్పుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్‌‍్డ ట్రంప్‌ వైఖరి గురించి ప్రస్తావించగా..‘ ఆయనకు అసలు మెదడు లేదు. అందుకే ఆయనలోనూ ఏమార్పు ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా భౌతిక శాస్త్రం(మెజరింగ్‌ అండ్‌ మ్యానిపులేషన్‌ ఆఫ్‌ ఇండివిడ్యువల్‌ క్వాంటం సిస్టమ్‌)లో తన పరిశోధనలకు గానూ మరో శాస్త్రవేత్త డేవిడ్‌ జే. విన్‌లాండ్‌తో కలిసి సెర్జ్‌ 2012లో నోబెల్‌ బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top