1,377 కోట్లకు టైమ్‌ మేగజీన్‌ అమ్మకం

Salesforce Billionaire Marc Benioff To Buy 'Time' Magazine - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ యాజమాన్యం మరోసారి మారింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దిగ్గజం సేల్స్‌ ఫోర్స్‌ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ మార్క్‌ బెనియాఫ్‌కు టైమ్‌ మేగజీన్‌ను రూ.1,377 కోట్లకు (190 మిలియన్‌ డాలర్లు) అమ్ముతున్నట్లు మెరిడిత్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి నగదును చెల్లించనున్నట్లు వెల్లడించింది. టైమ్‌ మేగజీన్‌ రోజువారీ వార్తలకు సేకరణ, ప్రచురణలకు సంబంధించి నూతన యాజమాన్యం జోక్యం చేసుకోబోదని పేర్కొంది.

ఈ కొనుగోలు పూర్తిగా బెనియాఫ్‌ వ్యక్తిగతమనీ, దీనికి సేల్స్‌ఫోర్స్‌ కంపెనీతో సంబంధం లేదంది. గతేడాది టైమ్‌ మేగజీన్‌ సహా పలు ప్రచురణలను టైమ్‌ కంపెనీ నుంచి మెరిడిత్‌ కొనుగోలు చేసింది. ఈ విషయమై బెనియాఫ్‌ దంపతులు స్పందిస్తూ.. ప్రపంచంపై గణనీయమైన ప్రభావం చూపగల కంపెనీలో తాము పెట్టుబడి పెడుతున్నామని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 1923, మార్చిలో యేల్‌ యూనివర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థులు హెన్రీ లూస్, బ్రిటాన్‌ హడెన్‌లు కలసి టైమ్‌ మేగజీన్‌ను ప్రారంభించారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఇదే తరహాలో 2013లో వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికను రూ.1,811 కోట్లకు కొన్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top