ముగాబే రాజీనామా

Robert Mugabe resignation ushers in new era for Zimbabwe - Sakshi

4 దశాబ్దాల పాలనకు తెర

జింబాబ్వే తదుపరి అధ్యక్షుడిగా ఎమర్సన్‌!

హరారే: జింబాబ్వే అధ్యక్ష పదవికి రాబర్ట్‌ ముగాబే ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఈ వార్త తెలియగానే దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. పదవి నుంచి దిగిపోవాలని నలువైపులా పెరుగుతున్న ఒత్తిడి, ఆయన్ని అభిశంసించే ప్రక్రియను జింబాబ్వే పార్లమెంట్‌ ప్రారంభించడంతో ముగాబే దిగిరాక తప్పలేదు. దీంతో సుమారు 4 దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగిన ఆయన పాలనకు ఎట్టకేలకు తెరపడినట్లయింది.

మంగళవారం ముగాబే పంపిన రాజీనామా లేఖను పార్లమెంట్‌ స్పీకర్‌ జాకబ్‌ ముడెండా పార్లమెంట్‌ ఉమ్మడి సమావేశంలో చదివి వినిపించారు. ‘జింబాబ్వే ప్రజల సంక్షేమం, సజావుగా అధికార బదిలీ జరిగేందుకు నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను’ అని అందులో తెలిపారు. ఇటీవలే ఉపాధ్యక్ష పదవి కోల్పోయిన ఎమర్సన్‌ నంగాగ్వా రెండు రోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని అధికార పార్టీ జాను–పీఎఫ్‌ చీఫ్‌ విప్‌ లవ్‌మోర్‌ మాటుకే వెల్లడించారు.

1980 నుంచి..: భార్య గ్రేస్‌ను తన వారసురాలిగా చేయాలనుకుని ఆమెకు పోటీ గా ఉన్న ఉపాధ్యక్షుడు ఎమర్సన్‌ను ముగాబే పదవి నుంచి తొలగించడంతో దేశంలో అస్థిరత ఏర్పడింది. ఎమర్సన్‌కు అండగా నిలిచిన సైన్యం ముగాబే, ఆయన భార్యను గృహ నిర్బంధంలోకి తీసుకుంది. ముగాబే గద్దె దిగాల్సిందేనని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళలు నిర్వహించారు. సొంత పార్టీ జాను–పీఎఫ్‌ ముగాబేను తమ చీఫ్‌గా తొలగించి ఎమర్సన్‌ను నియమించింది. 1980 నుంచి ముగాబేనే జింబాబ్వే అధ్యక్షుడిగా ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top