కరోనా: హెల్త్‌ వాలంటీర్‌గా స్వీడన్‌ యువరాణి

Princess Sofia Of Sweden Starts Work At Hospital Fight Against Covid 19 - Sakshi

స్టాక్‌హోం: మహమ్మారి కరోనా(కోవిడ్‌-19)పై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్‌ యువరాణి, ప్రిన్స్‌ కార్ల్‌ ఫిలిప్‌ భార్య సోఫియా(35) ముందుకు వచ్చారు. మూడు రోజుల ఇంటెన్సివ్‌ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్‌ అవతారమెత్తారు. తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోఫియామెట్‌ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె నేరుగా కోవిడ్‌-19 పేషెంట్లకు సేవలు అందించారు గానీ వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని ది రాయల్‌ సెంట్రల్‌ వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ఈ సంక్షోభంలో యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందిని అధిక భారం నుంచి విముక్తి చేయాలని భావించారు’’అని రాయల్‌ కోర్టు ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొంది.(మరణాలు @ 33 వేలు)

కాగా సోఫియామెట్‌ ఆస్పత్రి వైద్యేతర సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందిపై అధిక భారం పడకుండా క్లీనింగ్‌, వంట చేయడం తదితర పనుల్లో శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 80 మంది సోఫియామెట్‌ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. తాజాగా యువరాణి సోఫియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇక నీలం రంగు ఆప్రాన్‌ ధరించిన సోఫియా ఫొటోలు రాయల్స్‌ ఆఫ్‌ స్వీడన్‌ ఇన్‌స్టా పేజ్‌లో షేర్‌ చేయగా.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా స్వీడన్‌లో ఇప్పటి వరకు 1300 కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top