వ్యూహాత్మక భాగస్వామ్యంతో..!

PM Narendra Modi, Indonesia President Widodo agree to take bilateral relations - Sakshi

ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో ప్రధాని మోదీ భేటీ

ఇరుదేశాల మధ్య 15 కీలక ఒప్పందాలు

ద్వైపాక్షిక వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధిపై చర్చ

జకార్తా: ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి నెలకొల్పడంతోపాటు పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇండోనేసియా నిర్ణయించాయి. ఉగ్రవాదంపై పోరులోనూ ప్రపంచదేశాలన్నీ ఒకేతాటిపైకి రావాలని పిలుపునిచ్చాయి. బుధవారం జకార్తాలో భారత ప్రధాని మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి.

ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతంతోపాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలను గౌరవిస్తూ, ఇతర అంశాల్లోనూ సహకరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయించారు. ఈ సందర్భంగా భారత్, ఇండోనేసియా మధ్య రక్షణ రంగంలో సహకారం, అంతరిక్ష ప్రయోగాలు, శాస్త్ర–సాంకేతికత, రైల్వేలు, వైద్యం, సాంస్కృతిక సంబంధాల బలోపేతం సహా 15 ఒప్పందాలు జరిగాయి. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో..  విస్తృతస్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు మోదీ చెప్పారు.

ఉగ్రవాదంపై సమైక్యపోరు
ఇండోనేసియాలో ఇటీవల చర్చిలపై జరిగిన దాడిని ప్రధాని ఖండించారు. ఇరువురు నేతలు కూడా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దీన్ని అంతం చేసేందుకు కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని దేశాలూ ఉగ్రవాదం, వీరికి ఆర్థిక సాయం చేస్తున్న మార్గాలపై పోరాటంలో ఒకే తాటిపైకి రావాలని కోరారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 కల్లా 50 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.3.37 లక్షల కోట్లు) తీసుకెళ్లే దిశగా రెట్టింపు కృషితో పనిచేయాలని కూడా నిర్ణయించారు. సముద్రం ద్వారా జరిగే వ్యాపారాన్ని పెంచే అంశాలపై చర్చించారు.  

దక్షిణ చైనా సముద్రంపై..
భారీగా ఇంధన నిల్వలున్న తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు పారదర్శకమైన నియమాలతో కూడిన విధానం ప్రాముఖ్యతనూ మోదీ–విడోడోలు చర్చించారు. 1982లో చేసిన సముద్ర చట్టాలపై ఐరాస సదస్సు (యూఎన్‌సీఎల్‌ఓఎస్‌), 1976 నాటి ఆగ్నేయాసియా మైత్రి, సహకార ఒప్పందం (టీఏసీ)ల ప్రకారం భారత్, ఇండోనేసియా, ఇతర ఇండో–పసిఫిక్‌ దేశాల హక్కులను కాపాడాల్సిన ఆవశ్యకతనూ చర్చించారు. అండమాన్‌ (భారత్‌), సబంగ్‌ (ఇండోనేసియా) మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా ఇరు ప్రాంతాల్లో వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను వృద్ధి చేసేందుకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని మోదీ–విడోడో నిర్ణయించారు.

అర్జునుడి విగ్రహం సందర్శన
ఈ చర్చల అనంతరం మోదీ, విడోడో కలిసి జకార్తాలోని అర్జునుడి రథం విగ్రహాన్ని సందర్శించారు. 1987లో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత రామాయణ, మహాభారతాల థీమ్‌తో ఏర్పాటుచేసిన కైట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.

30 రోజుల ఉచిత వీసా
ఇండోనేసియా పౌరులు భారత్‌లో పర్యటించాలని మోదీ కోరారు. ఇందుకోసం వీరికి 30రోజుల పాటు ఉచిత వీసా ఇస్తామన్నారు. నవభారత అనుభవాన్ని పొందేందుకు భారత ఇండోనేసియన్లు భారత్‌కు రావాలన్నారు. జకార్తా కన్వెన్షన్‌ సెంటర్లో భారత సంతతి ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇండియా–ఇండోనేసియాల పేర్లలో సారూప్యత ఉన్నట్లే ఈ రెండు దేశాల సంస్కృతి సంప్రదాయాల్లోనూ బలమైన స్నేహబంధం ఉందని పేర్కొన్నారు.

భారత ఇండోనేసియన్లు తరచూ ఇండియాను సందర్శించే అలవాటు చేసుకోవాలని.. అక్కడి తమ అనుభూతులను ఇక్కడి వారితో పంచుకునే వారధుల్లా పనిచేయాలని ప్రధాని కోరారు. ‘భారత్‌లో పర్యటించాలని ఇండోనేసియన్లను ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాది అలహాబాద్‌లో ప్రయాగ కుంభమేళా ఉంది. ఇక్కడికొస్తే మీకు నవభారతాన్ని ఒకేచోట చూసే అవకాశం కలుగుతుంది. భారత్‌లో పర్యటించేందుకు 30 రోజుల వరకు ఉచిత వీసా ఇస్తాం’ అని కరతాళధ్వనుల మధ్య మోదీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో మనుషులు ఒకచోట చేరే అతిపెద్ద కార్యక్రమంగా ప్రయాగ కుంభమేళా ప్రత్యేకత సంతరించుకుంది.  

                            కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top