విమానంతో చక్కర్లు

Plane crashes near Seattle airport - Sakshi

అనంతరం క్రాష్‌ ల్యాండింగ్‌

అమెరికాలో ఓ మెకానిక్‌ నిర్వాకం

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో హారిజన్‌ ఎయిర్‌కు చెందిన ఖాళీగా ఉన్న క్యూ400 విమానాన్ని రిచ్‌(29) అనే మెకానిక్‌ సియాటెల్‌–టకోమా ఎయిర్‌పోర్టులో దొంగిలించి గాల్లో చక్కర్లు కొట్టించాడు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) అనుమతి లేకుండా విమానం టేకాఫ్‌ విషయం తెల్సి రెండు ఎఫ్‌–15 యుద్ధవిమానాలు ఆ విమానాన్ని వెంబడించాయి. గంటన్నరపాటు గాల్లో విమానం చక్కర్లు కొట్టించిన మెకానిక్‌ చివరకు కెట్రాన్‌ ద్వీపంలోని అడవిలో కూల్చేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఏమీ లేదని అధికారులు తేల్చారు. ప్రమాదంలో రిచ్‌ చనిపోయినట్లు భావిస్తున్నారు.

దింపుతా.. పైలట్‌ ఉద్యోగం ఇస్తారా?
మెకానిక్‌ విమానానికి కొంచెం ఇంధనం నింపి వెంటనే టేకాఫ్‌ చేశాడు. ఆకాశంలో ఇష్టానుసారం చక్కర్లు కొడుతున్న రిచ్‌తో ఏటీసీ సిబ్బంది మాట్లాడేందుకు ప్రయత్నించారు. ‘విజయవంతంగా విమానాన్ని టేకాఫ్‌ చేసినందుకు అభినందనలు. విమానాన్ని వెనక్కి తిప్పి ఎవరికీ నష్టం కలగకుండా ల్యాండింగ్‌ చేయండి’ అని రిచ్‌ను ఏటీసీ అధికారి కోరారు. దీనికి రిచ్‌ స్పందిస్తూ..‘నాకు ల్యాండింగ్‌ చేయడం తెలీదు. నేను ల్యాండ్‌ చేయాలనుకోవడం లేదు’ అని చెప్పాడు. టేకాఫ్‌ సమయంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇంధనం ఖర్చయిందని చెప్పాడు. సమీపంలోని సైనికస్థావరంలో విమానాన్ని దింపాలని ఏటీసీ అధికారి రిచ్‌ను కోరాడు. దీంతో రిచ్‌ స్పందిస్తూ..‘ఆ పని మాత్రం చేయను. వాళ్ల దగ్గర విమాన విధ్వంసక క్షిపణులు, గన్స్‌ ఉంటాయి’ అని చెప్పాడు. ఇప్పుడు నేను దొరికితే జీవితాంతం జైల్లో పడేస్తారు కదూ! అంటూ నవ్వాడు. నేను విమానాన్ని ల్యాండ్‌ చేస్తే పైలట్‌ ఉద్యోగం ఇస్తారా? అని ఎక్కసెక్కాలు ఆడాడు. చివరికి ‘నన్ను ప్రేమించేవాళ్లు చాలామంది ఉన్నారు. నేను చేసిన పని తెలిస్తే బాధపడతారు. వాళ్లందరికీ నా క్షమాపణలు. మానసికంగా దెబ్బతిన్నవాడిని. కొన్ని స్క్రూలు లూజ్‌ అయ్యాయి’ అని సదరు ఏటీసీ అధికారితో వ్యాఖ్యానించాడు. అనంతరం విమానాన్ని కెట్రాన్‌ ద్వీపంలో కూల్చేశాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top