పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇస్లామాబాద్ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏడుగురు వ్యక్తులపై గుజ్రాన్వాల కౌంటర్ టెర్రరిజం పోలీస్ స్టేషన్లో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ప్రమేయం ఉన్నప్పటికీ ... దానిపై పాక్ మాత్రం పెదవి విప్పడం లేదు. కాగా ఉగ్రవాదులు దాడి జరిపి సృష్టించిన బీభత్సంపై ఇప్పటికే మన దేశం కీలకమైన సాక్ష్యాధారాలను పాకిస్తాన్‌కు అందించింది. వాటిపై తగిన చర్యలు తీసుకున్నాక ఇరు దేశాలమధ్యా జరగాల్సిన చర్చలు ప్రారంభమవుతాయని కూడా రెండు దేశాలూ నిర్ణయించాయి.
ఆ ఉదంతానికి సంబంధించి జైషే మహమ్మద్ సంస్థ స్థావరాలపై దాడులు జరిగాయని, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చినా అందుకు సంబంధించిన పురోగతి ఏమిటో పాక్ ఇంతవరకూ చెప్పలేదు. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌ను అరెస్టు చేసినట్టు కథనాలు రావడం, చివరి అతను గృహ నిర్బంధంలో ఉన్నాడని గుప్పుమనడం కూడా అయింది. అయినప్పటికీ పాక్ మాత్రం తాజాగా ఏడుగురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయడం గమనార్హం.