
ఇస్లామాబాద్ : టిక్‌టాక్ స్టార్ హరీమ్‌షాతో తనకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవాద్ చౌదరి ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించారు. ' పదవులనేవి వస్తుంటాయి. పోతుంటాయి. కానీ ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం నేను భరించలేను. మనందరం మనుషులం.. ఎవరైనా మనపై తప్పుడు ఆరోపణలు చేస్తే స్పందించే హక్కు మనందరికి ఉంటుందని' చౌదరి పేర్కొన్నారు. అంతకుముందు టీవీ యాంకర్ ముబాషీర్ లుక్మాన్‌ను 'షేమ్ జర్నలిస్ట్'గా అభివర్ణిస్తూ ఆయన చెంప చెల్లుమనిపించారు. పవాద్ తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాని, ఎందుకంటే తాను ముందు ఒక మనిషినని, ఆ తర్వాతే మంత్రినని మీడియాతో పేర్కొన్నారు.
"ముబాషీర్ లుక్మాన్ లాంటి వ్యక్తులకు జర్నలిజంతో ఎటువంటి సంబంధం లేదు. అతని వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయడం నా కర్తవవ్యంగా భావించానంటూ" చౌదరి రీట్వీట్ చేశారు. టీవీ షోలో లుక్మాన్ తన తోటి యాంకర్ రాయ్ సాకిబ్ ఖరాల్ మాట్లాడుతూ.. టిక్ టాక్ స్టార్ హరీమ్ షాతో పవాద్ చౌదరి ఉన్న అసభ్య వీడియోలు ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేగాక తాను ఈ వీడియోలను వ్యక్తిగతంగా చూశానని పేర్కొన్నాడు. పవాద్ చౌదరి ఈరకంగా ప్రవర్తించడం ఆయనకు కొత్తేం కాదు. గతేడాది జూన్‌లో ఒక వివాహానికి హాజరైన పవాద్ చౌదరి టీవీ హోస్ట్ సామి ఇబ్రహీంను ఇదే విధంగా చెంపదెబ్బ కొట్టారు.